ఆంధ్రప్రదేశ్ లో రోడ్ల పరిస్థితి గురించి ప్రతిపక్షాలు, ప్రజలు అనేక సార్లు వివిధ రూపాల్లో విమర్శలు చేస్తున్నారు, ఆందోళనలు కూడా చేస్తున్నారు.కానీ రాష్ట్రంలో రోడ్ల పరిస్థితిని అధికార వైసీపీ వారే వినూత్నంగా విమర్శించడం రాష్ట్రవ్యాప్తంగా చర్చకు దారి తీస్తుంది.ఆంధ్రప్రదేశ్‌లో రోడ్లు బాగోలేవని చాలా మందికి తెలుసు. బయట రాష్ట్రాల వారు ఎప్పుడైనా ఏపీకి వెళ్తే ఇవేం రోడ్లు అని సోషల్ మీడియా వేదికగా పోస్ట్లు పెడుతూ ఉంటారు. కానీ ఆంధ్రా ప్రజలకు మాత్రం అలవాటైపోయింది. కానీ కొన్ని చోట్ల మాత్రం ప్రజలు ప్రశ్నిస్తూనే ఉన్నారు. ప్రభుత్వం దృష్టికి తమ సమస్యను తీసుకెళ్లేందుకు వినూత్న తరహాలో ప్రయత్నిస్తున్నారు. అలా ఓ యువకుడు చేసిన ప్రయత్నం సోషల్ మీడియాలో వైరల్ అయింది.
తన గ్రామానికి వెళ్లే దారిని బాగు చేయాలని కోరుతూ వైఎస్సార్ జిల్లా బ్రహ్మంగారిమఠం మండలం సోమిరెడ్డిపల్లె గ్రామానికి చెందిన రాజేష్ పొర్లు దండాలతో నిరసన చేపట్టారు. జగనన్న రోడ్డు వేయాలంటూ నినాదాలు చేస్తూ పొర్లు దండాలు పెట్టారు. రాజేష్ సోమిరెడ్డిపల్లె పంచాయతీకి చెందిన వార్డు సభ్యుడు మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకుడు తాను నిరసన చేస్తే తనపై పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తారని తెలిసి కూడా సాహసించారు. ఊరి ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఎలాగైనా రోడ్డుకు మరమ్మతులు చేయిస్తే చాలని అనుకున్నారు. అందుకే ఈ మార్గన్ని ఎంచుకుని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టీ రాష్ట్ర రోడ్ల పరిస్థితి అందరికీ తెలిసేలా చేశాడు.