ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలోని హామీల అమలు, ప్రత్యేక హోదా కల్పించడంపై సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చేపడుతున్న విచారణపై సుప్రీం కోర్టు స్టే విధించింది. గతంలో మాజీ ఎంపీ కొణతాల రామకృష్ణ విభజన చట్టం అమలు, ప్రత్యేక హోదాపై గతంలో వేసిన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరుగుతుంది. ఇటు విభజన చట్టం అమలుపై తెలంగాణకు చెందిన బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి కూడా మరో పిటిషన్ దాఖలు చేశారు.
పొంగులేటి దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీం కోర్టు ఇప్పటికే విచారణ జరుపుతోందని కాబట్టి కొణతాల పిటిషన్‌ను సుప్రీం కోర్టుకు బదిలీ చేసి పొంగులేటి పిటిషన్‌తో జత చేయాలంటూ కేంద్రం బదిలీ చేసేందుకు పిటిషన్‌ను దాఖలు చేసింది. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లలిత్, జస్టిస్ ఎస్ రవీంద్ర భట్‌తో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. హైకోర్టులో విచారణపై స్టే విధించిన ధర్మాసనం ప్రతివాదులైన కొణతాల రామకృష్ణ, నీతీ ఆయోగ్, ఏపీ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను అక్టోబరు 14కు వాయిదా వేసింది.