ఏపిఐఐసి మాజీ చైర్మన్ శ్రీఘాకోళ్లపు శివరామ సుబ్రహ్మణ్యం ఆహ్వానంతో రాజమండ్రిలో చినజీయర్ స్వామి ఆధ్యాత్మిక ప్రవచనాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం నుంచి రాజమండ్రి ప్రయాణించేందుకు మూడు గంటల సమయం పట్టిందని ఆ ప్రయాణంలో కూడా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నానని అన్నారు. ప్రయాణంలో ఇటువంటి ఇబ్బందులు ఏర్పడడానికి బహుశా రోడ్ల మీద గోతులు ఎక్కువ ఉండడం వల్లనేమో అంటూ చినజీయర్ స్వామి చలోక్తులు విసిరారు.
ఏపీలోని రోడ్ల దుస్థితిపై చినజీయర్ స్వామి ఆవేదనతో స్పందించారు : నారా లోకేశ్
ఏపీలో రోడ్ల పరిస్థితి దారుణంగా ఉందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మండిపడ్డారు. రాష్ట్రంలో రోడ్లు నడిచేందుకు కూడా వీలుగా లేవని జనాలు గగ్గోలు పెడుతున్నారన్నారు. పక్క రాష్ట్ర పాలకులు అధ్వాన పాలనకు ఉదాహరణగా మన రాష్ట్రాన్నే చూపిస్తున్నారని ఎద్దేవా చేశారు. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదని చెప్పారు. రాజకీయలకు దూరంగా, ఆధ్యాత్మిక ప్రపంచానికి దగ్గరగా, హిందూ ధర్మ ప్రచారమే జీవిత లక్ష్యంగా సాగుతోన్న చినజీయర్ స్వామి ఏపీలోని రహదారుల దుస్థితిపై ఆవేదన వ్యక్తం చేశారని లోకేశ్ చెప్పారు. గతుకులు, గుంతలు, ఒడిదుడుకుల గురించి ప్రస్తావిస్తూనే జంగారెడ్డిగూడెం నుంచి రాజమండ్రి వరకు రోడ్డు ప్రయాణం ఒక జ్ఞాపకంగా మిగిలిపోనుందని రోడ్ల దుస్థితిని భక్తులకు చెపుతూ ప్రవచనంలో భాగంగా వ్యాఖ్యానించడం చూస్తుంటే జగన్ రెడ్డి పాలనలో రహదారులు ఎంత దారుణంగా ఉన్నాయో అర్థమవుతుందని లోకేశ్ అన్నారు.






