– అన్ని పదవుల్లో బీసీలకు ప్రాధాన్యత
– రెండోసారి రాజ్యసభకు సాయిరెడ్డి
– న్యాయవాది నిరంజన్ రెడ్డికి ఛాన్స్
– తెలంగాణ నుంచి ఇద్దరికి అవకాశం
– బీసీ కోటాలో బీద మస్తాన్రావు, ఆర్.కృష్ణయ్యలకు అవకాశం
– వైసీపీ అభ్యర్థిత్వాలను ప్రకటించిన మంత్రి బొత్స, సజ్జల రామకృష్ణారెడ్డి
ఏపీలో త్వరలో ఖాళీ కానున్న నాలుగు రాజ్యసభ సీట్లకు జరగనున్న ఎన్నికల కోసం అధికార వైసీపీ నలుగురు అభ్యర్థులను ప్రకటించింది. ఈ మేరకు తుది జాబితాను సీఎం జగన్ ఖరారు చేయగా మంత్రి బొత్స సత్యనారాయణ, పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించారు. నలుగురు అభ్యర్థుల పేర్లను మంగళవారం ప్రకటించారు. అంతా భావించినట్లుగానే పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత వేణుంబాక విజయసాయిరెడ్డికి మరోమారు రాజ్యసభ సభ్యత్వం ఇచ్చేందుకు వైసీపీ అధిష్ఠానం నిర్ణయించింది. జగన్కు వ్యక్తిగత న్యాయవాదిగా కొనసాగుతున్న నిరంజన్ రెడ్డికి కూడా ఆ పార్టీ రాజ్యసభ సీటు ఇచ్చింది. మిగిలిన రెండు స్థానాలను బీసీ సామాజిక వర్గానికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త బీద మస్తాన్ రావు, బీసీ సంఘాల జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్యకు ఇస్తూ వైసీపీ నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ప్రత్యక్ష పోస్టులైనా, నామినేటెడ్ అయినా వైసీపీది ఒకటే దారి అన్నారు. టీడీపీ నినాదాలకు పరిమితం, మాది చిత్తశుద్ధితో కూడిన ఆచరణ, జనాభా దమాషాకు తగ్గట్టుగా బడుగు, బలహీన వర్గాలకు పదవులు ఇచ్చారని తెలిపారు. మూడేళ్లలో భర్తీ చేసిన అన్ని పదవుల్లో బీసీలకు ప్రాధాన్యత ఇచ్చారని చెప్పారు.