రాష్ట్రంలో రోజురోజుకూ మహిళల మీద అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి..అత్యాచారాలు , హత్యలు రోజూ ఎక్కడో ఒక చోట జరుగుతూనే ఉన్నాయి. స్వతంత్ర భారత దేశంలో మహిళలకు రక్షణ అనేది లేకుండా పోయింది. గుంటూరులోని తుమ్మపూడిలో ఒక మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడి హత్య చేశారు. కొల్లూరు మండలంలోని చిలుమూరు లంక గ్రామంలో మరో మహిళ కూడా హత్యకు గురయ్యింది. ఏలూరులోని గురవాయిగూడెంలో గిరిజన మహిళల పై దాడి చేసి వస్త్రాలను చింపి అసభ్యంగా ప్రవర్తించి సాగు చేసుకున్న జామాయిల్ పంటను లాక్కుపోయారు.
చిత్తూరు, అనంతపురం, కర్నూలు, ప్రకాశం, కాకినాడ జిల్లాల్లో ఇలా రాష్ట్రంలో పలు చోట్ల ఎన్నో ఘటనలు జరిగాయి, జరుగుతూనే ఉన్నాయి. రాష్ట్రంలో మహిళలు, దళిత మహిళలు, గిరిజన మహిళలపై అత్యాచారాలు, హత్యలు , దాడులు రోజురోజుకి పెరిగిపోతూనే ఉన్నాయి. ప్రభుత్వం మాత్రం ఉదాసీన వైఖరిని ప్రదర్శిస్తోంది. రాబోయే 2024 ఎన్నికల్లో 175 సీట్లు ఎలా సాధించాలి ? అనే విషయంపై మాత్రం ఎక్కడలేని శ్రద్ధను కనబరుస్తున్నారు కానీ మహిళలపై జరుగుతున్నా హత్యాకాండల్ని ఏమాత్రం ఆపడానికి చర్యలు తీసుకోవడం లేదు.
తాము చేస్తున్న గొప్పల గురుంచి ప్రచారం చేసుకోవటానికి ప్రభుత్వం సమయాన్ని కేటాయిస్తోంది. కానీ మహిళా సంక్షేమాన్ని మాత్రం గాలికొదిలేసింది.. ఇటీవల జరుగుతున్న అత్యాచారాలు, హత్యలు, దాడులు అరికట్టడానికి, ప్రజల్లో చైతన్యం నింపడానికి ప్రచార కార్యక్రమాలు ఏర్పాటు చేసి మహిళల్ని చైతన్య వంతుల్ని చేయాలి. గన్నవరం లో ఇటీవల ఒక మహిళా విధుల నిర్వహించుకుని ఇంటికి వెళ్లే సమయంలో ఒక ఆకతాయి అల్లరి పెడుతుంటే ఏ మాత్రం భయపడకుండా రోడ్డు మీద దొరికిన చింతబరికెతో చెత్త కింద కొట్టి తనని తానూ కాపాడుకుంది. ఆ వీడియొ సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. ప్రభుత్వాలు పట్టించుకోని పక్షంలో మహిళలే తమకు తాము స్వచ్చందంగా ముందుకొచ్చి తమను తాము కాపాడుకోవాలి. పోలీసు యంత్రాంగాన్ని ఆ దిశగా నడిపించడంలో ప్రభుత్వం విఫలమయ్యింది. ప్రజా ఉద్యమాలను అణిచేసి, ప్రజాప్రతినిధులకు సేవలకు పరిమితమయ్యేలా చేసింది ఈ ప్రభుత్వం.. మహిళలు కూడా వాళ్ళ హక్కులను చట్టాలను తెలుసుకోవాలి.
ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం అత్యాచారం, దాడులు చేసిన నేరస్తులను వెంటనే సిఖ్శించాలి. అవసరమైతే గుంటూరు రమ్య హత్య కేసులో ఎలాగైతే ఫాస్ట్ ట్రాక్ట్ కోర్ట్ ఏర్పాటు చేసి నిందితుడికి శిక్ష వేసారో అలాంటి ఫాస్ట్ ట్రాక్ట్ కోర్టులను ఏర్పాటు చేయాలి. బాధితులకు ప్రభుత్వం అండగా ఉందని, చట్టం కూడా తమ సమస్యలకు పరిష్కారం చూపిస్తుందని భరోసా కలగాలి ప్రభుత్వ పెద్దలు ఆ దిశగా కృషి చేయాలి.