రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఏపీ అసెంబ్లీ రెండో రోజు సమావేశాల్లో స్వల్ప చర్చ జరిగింది. ఈ చర్చలో సీఎం జగన్ మాట్లాడుతూ ఏపీ ఆర్థిక వ్యవస్థకు ఢోకా లేదని రాష్ట్రం బాగుంటే చంద్రబాబు జీర్ణించుకోలేకపోతున్నారని, చంద్రబాబు ఆర్థిక పరిస్థితే బాగోలేదేమో అని ఎద్దేవా చేశారు.రాష్ట్రం ఇబ్బందుల్లో ఉందని చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, చంద్రబాబు అండ్ టీమ్ లేనిది ఉన్నట్లు సృష్టించి ఏపీ శ్రీలంకలా అయిపోతుందని అవాస్తవాలు ప్రచారం చేశారన్నారు.ఆర్థిక పరిస్థితికిపై కేంద్రం, ఆర్బీఐకి టీడీపీ నేతలు తప్పుడు లేఖలు రాశారన్నారు.తప్పుడు కేసులతో ప్రభుత్వ సంక్షేమ పథకాలను అడ్డుకుంటున్నారని విమర్శించారు.
వైసీపీ ఎన్నికల హామీల్లో 98.44 శాతం అమలు చేశామని సీఎం జగన్ శాసనసభలో తెలిపారు. కోవిడ్ తో ఎన్నో సవాళ్లు ఎదురైనా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను అద్భుతంగా ముందుకు తీసుకెళ్లామన్నారు. కేంద్రంతో పోలిస్తే ఏపీ అప్పులు తక్కువగానే ఉన్నాయని సీఎం జగన్ చెప్పుకొచ్చారు. టీడీపీ ప్రభుత్వం హయాంలో అప్పులు 17.45 శాతం పెరిగాయన్నారు. కేంద్రం కన్నా ఎక్కువ అప్పులు చేసిన ఘనత చంద్రబాబుకు దక్కుతుందని విమర్శించారు. ఈ మూడేళ్లలో కేంద్ర రుణాలు రూ.135 లక్షల కోట్లకు పెరిగాయన్నారు. ఈ మూడేళ్లలో కేంద్రం అప్పులు 43.8 శాతం పెరిగాయని సీఎం జగన్ తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన నాటికి రాష్ట్ర రుణాలు రూ.1.26 లక్షల కోట్లు ఉన్నాయని సీఎం జగన్ తెలిపారు. టీడీపీ ప్రభుత్వం దిగిపోయే సమయానికి అవి రూ. 2.69 లక్షల కోట్లకు చేరాయన్నారు. చంద్రబాబు హయాంలో ఐదేళ్లలో 123.52 శాతం అప్పులు పెరిగాయని స్పష్టం చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన మూడేళ్లలో రాష్ట్ర రుణాలు రూ.3.82 లక్షల కోట్లకు పెరిగాయన్నారు. ఈ మూడేళ్లలో రాష్ట్ర రుణాలు కేవలం 41.4 శాతం మాత్రమే పెరిగాయన్నారు. కేంద్రంతో పోలిస్తే ఈ మూడేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం అప్పు తగ్గిందని వ్యాఖ్యానించారు.