టీడీపీ అధినేత చంద్రబాబు నిన్న జరిగిన పార్టీ మీటింగులో సిట్టింగ్ ఎమ్మెల్యే లకు తీపి కబురు చెప్పారు.తెలుగుదేశం పార్టీలో సిటింగ్ ఎమ్మెల్యేలు అందరికీ ఈసారి ఎన్నికల్లో టికెట్లు ఇవ్వనున్నట్లు పార్టీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. గురువారం సాయంత్రం తన నివాసంలో జరిగిన టీడీపీ శాసనసభాపక్ష సమావేశంలో ఆయన ఈ ప్రకటన చేశారని పార్టీవర్గాలు వెల్లడించాయి. ‘టీడీపీ ఎమ్మెల్యేలు వీరోచితంగా పోరాడుతున్నారు. వారందరికీ మళ్లీ టికెట్లు ఇస్తా. వారందరినీ గెలిపించుకొని తీసుకువస్తాను. 1994లో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ రోజు మనతో ఉన్న మొత్తం 74మంది సిటింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు ఇచ్చాం. వారిలో ఒకరు తప్ప అందరూ తిరిగి గెలిచారు’ అని చంద్రబాబు చెప్పారు.
కళా వెంకట్రావు ఒక్కరే గెలవలేదని, ఆయనకు కూడా తర్వాత రాజ్యసభ టికెట్టు ఇచ్చి ప్రమోషన్ కల్పించారని ఒక ఎమ్మెల్యే గుర్తు చేశారు. వైఎస్సార్సీపీ లో 70మంది సిటింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు ఇవ్వొద్దని పీకే బృందం చెప్పినట్లు సామాజిక మాధ్యమాల్లో వచ్చిన వార్త సమావేశంలో ప్రస్తావనకు వచ్చింది. ఆ సందర్భంగా చంద్రబాబు ఈ ప్రకటన చేశారు. ‘వైసీపీలో ఒకరినొకరు బ్లాక్ మెయిల్ చేసుకొంటున్నారు. టికెట్లు ఇవ్వబోనని ఎమ్మెల్యేలను జగన్ బెదిరిస్తున్నారు. టికెట్లు ఇవ్వనప్పుడు చాకిరీ ఎందుకని అనేక మంది ఎమ్మెల్యేలు పైపైన తిరుగుతున్నారు. మన ఎమ్మెల్యేలు వీరోచితంగా పోరాడుతున్నారు. వారి పోరాటాన్ని అభినందిస్తున్నాను. అందుకే సిటింగ్ ఎమ్మెల్యేలు అందరికీ టికెట్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకొన్నాను’ అని చంద్రబాబు చెప్పారు.
అలాగే క్షేత్రస్థాయిలో బలంగా పోరాడుతూ కేసుల్లో ఇరుక్కొంటున్న వారికి కింది స్థాయిలో కార్యకర్తలకు అండగా నిలుస్తూ ప్రజల్లో పనిచేస్తున్న వారికి కూడా టికెట్లు ఖాయంగా ఇస్తానని వెల్లడించారు. అమరావతిపై సీఎం జగన్ ద్వేషానికి అర్థంలేదని చంద్రబాబు అన్నారు. ‘అమరావతికి అంకురార్పణ, అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం జరిగాయి. జగన్ కూడా అసెంబ్లీలో ఆమోదం తెలిపారు. అమరావతి వల్ల నాకు పేరు వస్తుందని దానిపై ద్వేషం పెంచుకొంటే ఎలా? అమరావతి నిర్మాణమై అక్కడ సంపద సృష్టి జరిగితే మొత్తం రాష్ట్రం ప్రయోజనం పొందుతుంది. హైదరాబాద్ నగరం అభివృద్ధితో తెలంగాణ రాష్ట్రం ప్రయోజనం పొందుతోంది. తన ద్వేషానికి జగన్మోహన్ రెడ్డి ప్రాంతీయ వాద ముసుగు వేస్తున్నారు. టీడీపీ హయాంలో విశాఖ, తిరుపతిల్లో అమరావతికి మించిన అభివృద్ధి జరిగింది. రాష్ట్రానికి వచ్చిన పరిశ్రమలు, జాతీయ విద్యాసంస్థలను రాష్ట్రం మొత్తం పెట్టాం. ఉత్తరాంధ్ర, రాయలసీమపై ప్రేమ ఒలకబోసి ఏం చేశారు? తన మనుషులను పెట్టి విశాఖలో భూములను దోపిడీ దొంగల మాదిరిగా దోచుకొన్నారు. రాయలసీమకు ప్రాణాధారమైన సాగు నీటి ప్రాజెక్టులకు పైసా కూడా నిధులు ఇవ్వలేదు. తమ చేతగానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికి దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారు’ అని చంద్రబాబు తీవ్ర విమర్శలు చేశారు.