రెండు రోజులు ప్రశాంతంగా సాగిన అమరావతి రైతుల మహా పాదయాత్ర మూడవ రోజున స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది.తెనాలి ఐతానగర్ వైపు పాదయాత్రకు అనుమతి లేదని పోలీసులు పాదయాత్రను అడ్డుకున్నారు. రోడ్డుపై బారికేడ్లు పెట్టి పాదయాత్రను పోలీసులు అడ్డుకున్నారు. బారికేడ్లను స్థానికులు నెట్టివేశారు. పోలీసులు, రైతుల మధ్య తోపులాట జరిగింది. హైకోర్టు అనుమతి మేరకు యాత్ర చేస్తున్నామని పోలీసులు అడ్డుకోవడం సరి కాదని రైతులు వాదించారు. అయితే రైతులు వెళ్లాలనుకున్న దారిలో వైసీపీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ నివాసం ఉందని అటు వద్దని పోలీసులు స్పష్టం చేశారు. అమరావతి ఐకాస నేత గద్దె తిరుపతి రావు కోర్టు అనుమతులను ధిక్కరించకూడదు కాబట్టి పోలీసులు సూచించిన ప్రత్యామ్నాయ మార్గాల్లో బస్టాండు ప్రాంతం మీదుగా చినరావూరు, జంగడిగూడెం మీదుగా పాదయాత్ర మార్చుకుంటామని ప్రకటించడంతో వివాదం సద్దుమణిగింది.
పాదయాత్రకు ప్రజల నుంచి అపూర్వ స్వాగతం లభిస్తుంది అని, ఊహించిన దానికన్నా మిన్నగా ఆదరణ లభిస్తుండడంతో అమరావతి రైతును అడ్డుకునేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తుందని రైతులు మండిపడుతున్నారు. వైసీపీ మినహా అన్ని ప్రధాన రాజకీయ పార్టీల నేతలు హాజరై పాదయాత్రకు సంఘీభావం తెలిపారు. ప్రజలు అడుగడుగునా రైతులకు బ్రహ్మరథం పడుతున్నారని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.రెండో రోజు పాదయాత్రలో పెదవడ్లపూడి గ్రామస్థులు రూ.4 లక్షలను అమరావతి జేఏసీ ప్రతినిధి ఆరే శివారెడ్డికి టీడీపీ నాయకులు జవ్వాది కిరణ్చంద్, మాదల రమేష్, అన్నే చంద్రశేఖర్, బోయపాటి రవి, చిట్టిబొమ్మ వెంకటేశ్వరరావు అందజేశారు. పాదయాత్రికులకు విందు కూడా ఏర్పాటుచేశారు. మంగళగిరి వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ గౌరవాధ్యక్షుడు కంతేటి నాగేశ్వరరావు, అధ్యక్షుడు పుప్పాల కోటేశ్వరరావు, కార్యదర్శి వీసం వెంకటేశ్వరరావు తదితరులు అమరావతి రైతులకు సంఘీభావం తెలిపి రూ.10,116లను విరాళంగా అందజేశారు.






