తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లోని ప్రభుత్వ ఉద్యోగులకు జగన్ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ఎప్పటి నుండో పెండింగ్ లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగుల అంతర్రాష్ట్ర బదిలీలకు సీఎం జగన్ రెడ్డి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. దీనిపై ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఛైర్మన్ కె. వెంకటరామిరెడ్డి ప్రకటన విడుదల చేశారు. తెలంగాణ నుంచి ఏపీకి చెందిన ఉద్యోగులు, ఏపీ నుంచి తెలంగాణకు చెందిన ఉద్యోగులు బదిలీల కోసం చాలా రోజుల తర్వాత అంగీకారం లభించింది.
అంతర్రాష్ట్ర బదిలీ ప్రక్రియలో తెలంగాణ నుంచి 1338 మంది ఏపీకి వెళ్లనున్నారు. తెలంగాణకు చెందిన 1804 మంది ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ బదిలీ కానున్నారు. బదిలీల కోసం ఉద్యోగులు ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ విడిపోయినప్పటి నుంచి అటు ఏపీలో ఉన్న ఉద్యోగులు తెలంగాణకు రావాలని, తెలంగాణలో ఉన్న ఉద్యోగులు ఏపీకి వెళ్లాలని తీవ్రంగా ప్రయత్నాలు చేశారు. ఇన్నాళ్లకు వాళ్ల ప్రయత్నాలు ఫలించాయి. సాధారణ పరిపాలన విభాగం పంపిన ప్రతిపాదన ఫైల్‌పై సీఎం జగన్ సంతకం చేశారు. ప్రక్రియకు తెలంగాణ ప్రభుత్వం అంగీకరించాల్సి ఉంటుంది.ఉద్యోగుల కోసం రెండు ప్రభుత్వాలు ఓ నోటిఫికేషన్ విడుదల చేశాయి. ఇలా పరస్పర అంగీకారంతో బదిలీలు కోరకునే వారి వివరాలు సేకరించాయి. వాళ్ల బదిలీలకు ఏపీ ప్రభుత్వం సమ్మతి తెలిపింది.