ఆంధ్రప్రదేశ్ లో ప్రధాన ప్రతిపక్షం టీడీపీ మీద వరసగా జరుగుతున్న దాడుల మీద ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డికి టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు లేఖ రాశారు. రాష్ట్రంలో నెలకొన్న శాంతి భద్రతల గురించి డీజీపీకి ప్రశ్నలు వేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నాయా అని ప్రశ్నించారు.
అధికార పార్టీతో కుమ్మక్కు అయిన పోలీసులకు కుప్పం నియోజకవర్గంలో పరిస్థితులు చిన్న విషయంలా కనిపిస్తున్నాయా అని టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. తెలుగు దేశం నాయకులపై, కార్యకర్తలపై వైసీపీ పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు, పోలీసులు దాడులు చేస్తున్నారని, అయినా ఆంధ్రప్రదేశ్ లో శాంతి భద్రతలు బాగానే ఉన్నాయని రాష్ట్ర డీజీపీ చెప్పడాన్ని చంద్రబాబు నాయుడు ఆక్షేపించారు. రాష్ట్రంలో జరిగిన విషయాలన్నీ చాలా సాధారణ ఘటనలేనని డీజీపీ ప్రకటించడాన్ని చంద్రబాబు నాయుడు తీవ్రంగా ఖండించారు. కుప్పం నియోజకవర్గంలో హింసా రాజకీయాలు జరుగుతున్నాయని, టీడీపీకి చెందిన నాయకులు, కార్యకర్తలపై దాడులు చేస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. తమ పార్టీ నాయకులపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని వివరిస్తూ చంద్రబాబు నాయుడు రాష్ట్ర డీజీపీకి లేఖ రాశారు.
విజయవాడలో మాజీ కార్పొరేటర్ చెన్నుపాటి గాంధీ పై జరిగిన దాడిని కూడా బాబు తీవ్రంగా ఖండించారు. చెన్ను పాటి గాంధీపై దాడి చేసిన వారిని వెంటనే అదుపులోకి తీసుకోవాలని ఈ సందర్భంగా బాబు డిమాండ్ చేశారు. వైసీపీ నాయకుల దాడి వల్ల చెన్నుపాటి గాంధీ కంటి చూపు కోల్పోయే ప్రమాదం ఉందనడంపై చంద్ర బాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ కార్యకర్తలపై, మద్దతు దారులపై పోలీసులు అకారణంగా, అక్రమంగా కేసులు పెడితే ఇక న్యాయం ఎక్కడ ఉన్నట్లు అని చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. పోలీసుల మధ్య సాధారణ దుస్తుల్లో ఉన్న ఒక వ్యక్తి టీడీపీ మద్దతు దారులపై లాఠీతో రక్తం కారేలా తీవ్రంగా దాడి చేసి, తల పగలు గొడితే మీకు చిన్న విషయం లాగా కనిపిస్తుందా అని లేఖలో చంద్రబాబు ప్రశ్నించారు.