ఆంధ్రప్రదేశ్ లో ప్లాస్టిక్ ఫ్లెక్సీల నిషేధం అమలులోకి వస్తుందంటూ ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఇటీవల విశాఖ పర్యటనలో ప్రకటించారు. డెడ్ లైన్ కూడా లేదన్నట్టు తక్షణం అమలులోకి వస్తుందని మూడు రోజుల కిందట బహిరంగ వేదికపై చెప్పేశారు. అప్పటినుంచి ఫ్లెక్సీలు, బ్యానర్ల వ్యాపారుల్లో ఆందోళన మొదలైంది. మా వ్యాపారులు మూసేసుకోవాలా అంటూ వారు నిరసనలకు దిగారు. ఓవైపు ఈ ఇష్యూ ఇంత సీరియస్ గా జరుగుతుంటే, మరోవైపు ప్లాస్టిక్ బ్యాన్ ని జనసేన అధినేత పవన్ కల్యాణ్ కి ముడిపెడుతూ మరో ప్రచారం మొదలైంది.
పవన్ కల్యాణ్ భీమ్లా నాయక్ సినిమా విడుదల సమయంలో ప్రభుత్వం టికెట్ రేట్లను అనూహ్యంగా తగ్గించింది. అప్పట్లో ప్రేక్షకులు ఇబ్బంది పడుతున్నారని, పేద వారికి తక్కువ ధరకే వినోదం అందించాలంటే టికెట్ రేట్లు తగ్గించాలని చెప్పింది ప్రభుత్వం. అంతే కాదు, టికెట్లు అధిక ధరకు అమ్ముతున్నారేమోనని థియేటర్ల దగ్గర ఎమ్మార్వోలు, వీఆర్వోలు డ్యూటీలు కూడా వేశారు. ఆ తరవాత సినిమా టికెట్ రేట్లు విషయం ఇండస్ట్రీ పెద్దలు అడుగుతున్నారని పెంచారు.
ఇదే ఫార్ములా లో ఇప్పుడు పవన్ కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ప్లాస్టిక్ ఫ్లెక్సీల నిషేధాన్ని తెరపైకి సీఎం తీసుకొని వచ్చారని విమర్శలు వినపడుతున్నాయి. ఈ విషయాన్ని జనసేన పార్టీ క్యాడర్ తమ వాట్సప్, సోషల్ మీడియా గ్రూపుల్లో విపరీతంగా ట్రెండ్ చేస్తున్నారు.పవన్ కల్యాణ్ పుట్టినరోజు అయిపోగానే ఫ్లెక్సీ పరిశ్రమ కార్మికుల ఇబ్బందులు చూడలేక బ్యాన్ ఎత్తేస్తామంటూ ప్రభుత్వం ప్రకటిస్తుందని అంటున్నారు. ఈ విషయంలో టీడీపీ కూడా జనసేన కి సపోర్ట్ చేస్తుంది.టీడీపీ ఫైర్ బ్రాండ్ వంగలపూడి అనిత పవన్ కళ్యాణ్ కి మద్దతుగా ట్వీట్ చేశారు.
ఈ ప్లాస్టిక్ బ్యానర్లు, ఫ్లెక్సీల బ్యాన్ కూడా సినిమా టికెట్ రేట్ల వ్యవహారం లానేనా? పవన్ కళ్యాణ్ సినిమా విడుదల వరకూ తగ్గిన టికెట్ రేట్లు ఆ తర్వాత మళ్ళీ పెరిగినట్లు, ప్లాస్టిక్ ఫ్లెక్సీలు, బ్యానర్ల మీద బ్యాన్ కూడా @PawanKalyan గారి పుట్టినరోజు వరకూ ఉండి ఆ తర్వాత మాయమవుతుందా?
— Anitha Vangalapudi (@Anitha_TDP) August 28, 2022