గోరంట్ల మాధవ్ వ్యవహారంలో కొత్త ట్విస్ట్ వచ్చింది. తనకు పోలీసులు క్లీన్ చిట్ ఇఛ్చారంటూ ఆనందంగా అనంతపురం వచ్చి వందల కార్లతో ర్యాలీ చేసుకునే సమయాన.. టీడీపీ బాంబు పేల్చింది. ఆ వీడియోకు ఫోరెన్సిక్ టెస్ట్ తామే చేయించామని.. అది ఒరిజినల్ అని తేలిందని రిపోర్టు చూపించింది. అమెరికాలోని ఎక్ లిప్స్ అనే సంస్థ దగ్గర జిమ్ స్టాఫర్డ్ అనే నిపుణుడు సంతకం చేసిన ఆ రిపోర్టును మీడియాకు రిలీజ్ చేశారు టీడీపీ వాళ్లు. ఇప్పుడేమంటారు అంటూ టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి వైసీపీ వాళ్లకు సవాల్ విసిరారు.ఇక్కడే కొత్త చర్చ మొదలైంది. ఈ ఎక్ లిప్స్ సంస్థ అమెరికాదంటున్నారు.. వీళ్లు అడగగానే వాళ్లు చేసిచ్చేస్తారా అంటూ సోషల్ మీడియాలో వైసీపీ మద్దతుదారులు అడగటం మొదలెట్టారు. మీకు డౌటుంటే మీరు కూడా అడగండి ఇస్తారని టీడీపీ మద్దతుదారులు సమాదానమిస్తున్నారు. ఇప్పుడు ఈ రిపోర్టు ఒరిజినలా కాదా అనే వాదనలు నడుస్తున్నాయి. అయితే టీడీపీ మాత్రం అందులో ఏ అనుమానం లేదని.. అది ఫేమస్ సంస్థేనని.. కావాలంటే చెక్ చేసుకోవచ్చని అంటోంది.
ఇప్పటికే టీడీపీ, వైసీపీల మధ్య ఐదురోజులుగా నడుస్తున్న ఆర్గ్యుమెంట్స్ ముదిరి పాకాన పడ్డాయి. శృతి మించి కామెంట్లు పీక్స్ కి వెళ్లిపోతున్నాయి. ఇవన్నీ చాలదన్నట్లు.. ఎంపీ గోరంట్ల మాధవ్ హిందూపురం వస్తుంటే.. పెద్ద ర్యాలీగా స్వాగతం పలికే ఏర్పాట్లు చేశారు. ఇదంతా మాధవే చేయించుకున్నారనే టాక్ కూడా ఉంది. ఆ వీడియోతో భారీగా డ్యామేజ్ అయిన ఇమేజ్ ను పికప్ చేసుకోవడానికే ఈ ర్యాలీ పెట్టారనే ప్రచారం జరుగుతోంది. మాధవ్ ఖర్చు పెట్టుకుని మరీ ఈ ర్యాలీ చేయిస్తున్నారని చెప్పుకుంటున్నారు.వీడియో ఒరిజినలా కాదా తేల్చాకే చర్యలు అన్న వైసీపీ.. తెలివిగా విషయం సాగదీసి.. డైవర్ట్ చేయాలని ప్రయత్నిస్తోంది. మరోవైపు టీడీపీ ఈ నిప్పు చల్లార్చకుండా ఉండేలా ప్రయత్నిస్తోంది. అందులో భాగమే ఈ ఫోరెన్సిక్ రిపోర్ట్ అనే వాదన వినపడుతోంది. ఇప్పుడు ఈ రిపోర్టు కరెక్ట్ కాదని వైసీపీ వాదిస్తుంది. అలా మరో వారంపాటు గోరంట్ల మాధవ్ పేరు మోగుతూనే ఉంటుందనేదే టీడీపీ కాన్సెప్టుగా చెప్పుకుంటున్నారు.జాతీయ మహిళా కమిషన్ కోరిక మేరకు స్పీకర్ కూడా నివేదిక అడిగే అవకాశముందని తెలుస్తోంది. అదే జరిగితే.. జాతీయ స్థాయిలో ఈ వ్యవహారం రచ్చకెక్కేలా ఉంది. విచిత్రం ఏంటంటే.. అసలు ఈ వీడియో రికార్డింగ్ ఎప్పుడు జరిగింది… మాధవ్ ఏ జిమ్ లో కసరత్తు చేస్తున్నారో.. వీడియో కాల్ లో ఉన్న మహిళ ఎవరు.. వీటి గురించి మాత్రం ఎవరూ అడగటం లేదు.. చెప్పడం లేదు.