మహానాడు అంటే గుర్తొచ్చేది ఎన్టీఆర్..మహానాడు అంటే తెలుగువారి పండుగని ఆ పార్టీ అధినేత అన్నారు చంద్రబాబు నాయుడు. టీడీపీ వెనుకబడిన తరగతుల పార్టీ అని పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ పండుగ మహానాడు కార్యక్రమం ఒంగోలులో అట్టహాసంగా ప్రారంభమయ్యింది. ఏ సందర్భంగా ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. పార్టీ వ్యవస్థాపకుడు, దివంగత ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి, నివాళులర్పించారు. అనంతరం ‘మా తెలుగు తల్లికి మల్లెపూదండ’ పాటతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పార్టీ కోసం ప్రాణాలర్పించిన కార్యకర్తలకు కూడా నివాళులర్పించారు చంద్రబాబునాయుడు.
కరోనా మహమ్మారి వచ్చిన తర్వాత జరుగుతున్న తొలి మహానాడు కార్యక్రమం కావడంతో టీడీపీ కార్యకర్తల్లో నూతనోత్సాహం ఉప్పొంగుతోంది. మరోవైపు ఈ కార్యక్రమం కోసం భారీ వేదికను ఏర్పాటుచేశారు. పార్టీకి చెందిన పొలిట్ బ్యూరో సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, మాజీలు ఇతర కీలక నేతలు దాదాపు 200 మందికి పైగా వేదికను అలంకరించారు.
ఒంగోలులోని మండువవారిపాలెంలో నిర్వహించిన టీడీపీ మహానాడులో పార్టీ అధినేత చంద్రబాబు ప్రసంగించారు. ఒక ఉన్మాది పాలన ఏపీకి శాపంగా పరిణమించిందని మండిపడ్డారు. పోలీసులను అడ్డం పెట్టుకుని అరాచక పాలనను కొనసాగిస్తున్నారన్నారు. ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని చెప్పారు. కబ్జాలు, దోపిడీలు పెరిగిపోయాయని దుయ్యబట్టారు. చేతకాని దద్దమ్మ పాలన వల్ల ఏపీ పరువు మొత్తం పోయిందని విమర్శించారు. ఒంగోలులో జరుగుతున్న మహానాడు కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
వచ్చే ఎన్నికల్లో 40 శాతం సీట్లు యువతకే కేటాయిస్తామని టీడీపీ (TDP) అధినేత చంద్రబాబు (Chandrababu) పేర్కొన్నారు. ఒంగోలు (Ongole)లో జరుగుతున్న మహానాడు కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ నేడు పార్టీకి కొత్త రక్తాన్ని ఎక్కించాల్సిన అవసరం ఉందన్నారు. పార్టీ కోసం పనిచేసే వాళ్లకే భవిష్యత్తులో అవకాశాలు వస్తాయని వివరించారు. రాష్ట్ర అప్పుల భారం రూ.8 లక్షల కోట్లకు పెరిగిందని వైసీపీ అవినీతి వల్లే రాష్ట్రం దివాళా తీసిందన్నారు. ‘‘ అంతా మోసకారి సంక్షేమమే. వైసీసీ ప్రభుత్వానికి పాలించే అర్హత లేదు. నిన్న జరిగిన ISBలో ప్రధాని తన పేరును ప్రస్తావించకపోయినా తన కృషి వల్లే ISB.. హైదరాబాద్‌కు వచ్చిందని ధీమా వ్యక్తం చేశారు. రూ.2 లక్షల కోట్ల సంపదను నాశనం చేశారని, పోలవరం డయాఫ్రం వాల్ కొట్టుకుపోయే పరిస్థితి తలెత్తిందని తెలిపారు. మద్యం, గంజాయి, డ్రగ్స్‌తో రాష్ట్రాన్ని నేరాంధ్రప్రదేశ్‌గా మార్చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం దగ్గర రాష్ట్రాన్ని తాకట్టు పెట్టడం ఏమిటి అంటూ ఈ సందర్భంగా ప్రశ్నించారు ..? ప్రాజెక్టులు కట్టడం చేతకాకపోతే ప్రభుత్వం గద్దె దిగాలి ’’ అని ప్రభుత్వానికి సవాల్ విసిరారు చంద్రబాబు.