భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరుని వివాదాల్లోకి లాగి రాజకీయంగా వాడుకుంటూ ఆ మహనీయుని ఖ్యాతిని తగ్గించేందుకు వైసీపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని జనసేన నాయకులు పోతిన మహేష్ విమర్శించారు. . నిజంగా వైసీపీ ప్రభుత్వానికి రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పట్ల చిత్తశుద్ధి ఉంటే కడప జిల్లాకు ఆయన పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. వీలు కాని పక్షంలో 27వ జిల్లాను పులివెందుల కేంద్రంగా ఏర్పాటు చేసి భీమ్ రావ్ జిల్లాగా నామకరణం చేయాలని డిమాండ్ చేశారు.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ సొంత నియోజకవర్గాన్ని ఈ విధంగా చేస్తే బాబాసాహెబ్ స్ఫూర్తి వెల్లడవుతుందన్నారు.
పచ్చటి కోనసీమలో అల్లర్లకు కారణమైన వైసీపీ నిర్ణయం పూర్తిగా ప్రభుత్వ వైఫల్యం. కులాల మధ్య చిచ్చుపెట్టే ఉద్దేశ్యంతో, ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టాలని ఉద్దేశపూర్వకంగానే వైసీపీ నాయకులు ఇలాంటి కుట్రలు, కుతంత్రాలకు పాల్పడుతున్నారు. కేవలం రాజకీయ లబ్ది కోసమే వైసీపీ ప్రభుత్వం జిల్లాల పేరు అంశాన్ని తెర మీదకు తెచ్చింది. ఇంత అల్లర్లు జరుగుతుంటే బాధ్యతగా స్పందించాల్సిన మంత్రులు ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. మంత్రి బొత్స సత్యనారాయణ జిల్లాల పేర్లు మార్చడం ఒక నిరంతర ప్రక్రియ అని చెప్పారు. పేర్లు మార్చడంతో పాటు కొత్త జిల్లాల ఏర్పాటు కూడ ఒక నిరంతర ప్రక్రియగా పెట్టుకోవాలని జనసేన పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం.
కడపకు వైఎస్ఆర్ కడప జిల్లా అని పేరు పెట్టారు. వైద్య వృత్తిలో ఉన్న వైఎస్ఆర్ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగారు అంటే అందుకు కారణం భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ . ఆయన తీసుకున్న నిర్ణయాల వల్లే ఇవాళ కశ్మీర్ భారత భూభాగంలో ఉంది. అలాంటి గొప్ప వ్యక్తి పేరుని వివాదాల్లోకి లాగి రాజకీయంగా వాడుకుంటూ మహనీయుడి ఖ్యాతిని తగ్గించేందుకు వైసీపీ ప్రభుత్వం దుర్మార్గమైన పనులు చేస్తోంది. నిజంగా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటే కడపకు డాక్టర్ భీమ్ రావ్ అంబేద్కర్ పేరుని పెట్టి దాన్ని నిరూపించుకోవాలి. 27వ జిల్లాగా బీమ్ రావ్ జిల్లాను పులివెందుల కేంద్రంగా ఏర్పాటు చేయాలని వైసీపీ ప్రభుత్వాన్ని, సీఎం జగన్ రెడ్డిని కోరారు..