కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరును కొనసాగించాలి – ఏపీసీసీ
కోనసీమలో జరిగిన అల్లర్లను నిరసిస్తూ ఛలో అమలాపురం కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పిలుపునిచ్చింది. కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరును కొనసాగించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రం దగ్గర ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద నుంచి చలో అమలాపురం కార్యక్రమంలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజనాథ్ తో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులను అరెస్ట్ చేసిన పోలీసులు చలో అమలాపురం కార్యక్రమాన్ని అడ్డుకున్నారు. అరెస్ట్ చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులను కృష్ణలంక పోలీస్ స్టేషన్ కు తరలించారు.
కోనసీమలోని కులోన్మాదులు , మతోన్మాదులు అంబేద్కర్ను అవమానించారని మండిపడ్డారు. కుట్రలకు ఆస్కారం కలిగించేలా ప్రభుత్వం వ్యవహరించిందన్నారు. మంత్రి ఇంటిపై దాడి జరిగిన తీరు అనుమానాలకు తావిస్తోందని పీసీసీ ఛీఫ్ శైలజనాథ్ అన్నారు. మంత్రి ఇంటికే దిక్కు లేకపోతే ప్రభుత్వం ప్రజలకు ఏం రక్షణ కల్పిస్తుందని ప్రశ్నించారు. అమలాపురం అల్లర్లను వైసీపీ నేతలే ప్రోత్సహించారనేది వాస్తవమని స్పష్టం చేశారు. ఈ వ్యవహారంపై ఈనెల 29వ తేదీన రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనున్నట్లు శైలజనాథ్ వెల్లడించారు.
జగన్ రెడ్డి ఇకనైనా ఓట్ల రాజకీయాలను మానుకోవాలని హితవు పలికారు. అంబేద్కర్ ను అవమానించడం అంటే రాజ్యాంగాన్ని అవమానించడమేనని, దేశ నాయకత్వాన్ని..జీవితాలను అవమానించడమేనన్నారు. కులోన్మాదులను, మతోన్మాదులను , రౌడీ షీటర్లను పోలీసులు పెంచి పోషిస్తున్నారని ఆరోపించారు. శాంతియుతంగా ఆందోళనలు చేయాలి తప్ప ఇలా కాదని, అమలాపురంలో అమాయకులైన ఎస్పీలు దెబ్బలు తింటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. భారత దేశ పౌరునిగా, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ప్రజల్లో ధైర్యం కల్పించాల్సిన బాధ్యత మా పై ఉందని శైలజనాథ్ స్పష్టం చేశారు.