అవినీతి నిరోధానికి ప్రభుత్వం ప్రజల చేతికే వజ్రాయుధాన్ని అందిస్తోంది అని డీజీపీ కేవి.రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. ప్రభుత్వ అధికారులు, సిబ్బంది, ఇతరుల అవినీతిపై ప్రజలు ఫిర్యాదు చేసేందుకు ప్రత్యేకంగా ‘14400 మొబైల్ యాప్‌ను రూపొందించారన్నారు. లంచాలు, అవినీతి లేకుండా ప్రభుత్వ పాలన పారదర్శకంగా సాగాలని సీఎం వైఎస్.జగన్‌మోహన్ రెడ్డి ఆదేశించారన్నారు. దీంతో అవినీతిపై ప్రజలు నేరుగా యాప్ ద్వారా ఫిర్యాదు చేసేందుకు 14400 మొబైల్ యాప్‌ను రూపొందించిన్నట్లు వివరించారు. అవినీతి నిరోధక శాఖ ACB ‘14400 యాప్’ ను రూపొందించింది. ఈ యాప్‌ను సీఎం త్వరలోనే ఆవిష్కరిస్తారన్నారు. మహిళల భద్రత కోసం ప్రభుత్వం వినూత్న రీతిలో దిశా యాప్‌ను తెచ్చిన విషయం తెలిసిందే. ఆపదలో ఉన్న మహిళలను తక్షణమే ఆదుకునేందుకు, పోలీస్ స్టేషన్‌కు వెళ్లాల్సిన అవసరం లేకుండా మహిళలు ఫిర్యాదు చేయడానికి అనువుగా రూపొందించిన ఈ యాప్ విజయవంతమైంది. అదే తరహాలో అవినీతిపై ప్రజలు తక్షణం ఫిర్యాదు చేసేందుకు ఈ యాప్‌ను రూపొందించింది. ఆధునిక సమాచార సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి దీనికి రూపకల్పన చేసింది.
ఆడియో, వీడియో, ఫొటో ఆధారాలతో సహా ఫిర్యాదు అవినీతిపై ఫిర్యాదుల కోసం ACB కొంతకాలంగా 14400 టోల్‌ఫ్రీ నంబరును నిర్వహిస్తోంది. ఈ నంబరుతో ఫిర్యాదు మాత్రమే చేయగలరు. టోల్‌ఫ్రీ నంబరుకు వచ్చే ఫోన్ కాల్స్‌పై ఏసీబీ అధికారులు స్పందించి తరువాత ఆకస్మిక దాడులు, తనిఖీలు చేస్తారు. బాధితుల ద్వారా లంచం ఎరవేసి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకొంటారు.
యాప్ పని చేస్తుందిలా..
14400 మొబైల్ యాప్‌లో ‘లైవ్ రిపోర్ట్’ ఉంటుంది. అధికారులు, సిబ్బంది లంచాలు అడుగుతున్నా, ఇతరత్రా అవినీతికి పాల్పడుతున్నా ఆ యాప్‌లో లైవ్ రిపోర్టింగ్ ఫీచర్ ద్వారా తక్షణం ఫిర్యాదు చేయవచ్చు. లైవ్ రిపోర్టింగ్ ఫీచర్‌లో ఫొటో, వీడియో, ఆడియో, ఫిర్యాదు చేయడానికి నమోదు ఆప్షన్లు ఉంటాయి. లంచం తీసుకుంటున్న లైవ్ ఫొటో తీసి ఆ యాప్‌లో అప్‌లోడ్ చేయవచ్చు. లంచం అడుగుతున్నప్పుడు మాటలను లైవ్‌లో రికార్డ్ చేసి అప్‌లోడ్ చేయవచ్చు. లైవ్ వీడియో కూడా రికార్డు చేసి అప్‌లోడ్ చేయవచ్చు. లైవ్ రిపోర్ట్‌కు అవకాశం లేకపోతే బాధితులు అప్పటికే రాసి ఉంచిన ఫిర్యాదు కాపీగానీ సంబంధిత ఫొటోలు, ఆడియో, వీడియో రికార్డింగ్‌లను కూడా యాప్ ద్వారా అప్‌లోడ్ చేయవచ్చు. లాడ్జ్ కంప్లైంట్ (ఫిర్యాదు నమోదు) ఆప్షన్‌లోకి వెళ్లి సబ్‌మిట్ ప్రెస్ చేస్తే ఏసీబీకి ఫిర్యాదు చేరుతుంది. ఫిర్యాదు చేసినట్టు వెంటనే మెసేజ్ వస్తుంది. వెంటనే ఆ ఫిర్యాదు ఏసీబీ ప్రధాన కార్యాలయంలోని ప్రత్యేక సెల్‌కు వెళుతుంది. అక్కడి సిబ్బంది ఫిర్యాదును సంబంధిత జిల్లా ఏసీబీ విభాగానికి పంపుతారు. వెంటనే సంబంధిత అధికారులు ఆ ప్రభుత్వాధికారి, సిబ్బందిపై కేసు నమోదు చేసి అరెస్టుగానీ ఇతరత్రా కఠిన చర్యలు గానీ తీసుకుంటారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభిస్తారు. ఆ కేసు పురోగతిని ఏసీబీ ఎప్పటికప్పుడు యాప్‌లో పొందుపరుస్తుంది.