కరోనా యోధులు అనగానే ముందువరుసలో ఉండి పోరాడిన పారిశుద్ధ్య కార్మికులే గుర్తుకు వస్తారు.ప్రాణాలకు సైతం లెక్కచెయ్యకుండా కరోనా సమయంలో సేవలు అందించారు. ఒక కరోనా అనేకాకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచి,ప్రజల ప్రాణాలను కూడా కాపాడటంలో వారి పాత్ర ఎనలేనిదనే చెప్పవచ్చు.కానీ..అలా తమ ప్రాణాలను పణంగా పెడుతూ సేవలు అందిస్తున్న వారికి కనీసం జీతాలను కూడా సరిగ్గా అందించడంలేదంటే ప్రభుత్వ పనితీరు ఏవిధంగా వుందో చెప్పవచ్చు.కరోనా సమయంలో పని చేసిన పారిశుద్ధ్య కార్మికులకు ఆరోగ్యభత్యాన్ని ఇస్తున్నట్టుగా ప్రకటించారు.అవి ఇప్పటి వరకు అందిన దాఖలాలు లేవు.అనారోగ్యం వస్తే డాక్టర్ దగ్గరకు వెళ్ళి చూపించుకునేందుకు చేతిలో పైసా లేకుండా అల్లాడిపోతున్నారు. పురపాలికల్లో పొరుగు సేవల విధానంలో పనిచేసే పారిశుద్ధ్య కార్మికులకు ఆరోగ్యభత్యాన్ని ఐదు నెలలుగా ప్రభుత్వం నిలిపివేసింది.
ఉదాహరణకు కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లోని నగరపాలిక, పురపాలికల్లో 4 వేల మందికి పైగా పనిచేస్తున్నారు. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత పొరుగుసేవల పద్ధతిలో పనిచేసే కార్మికులను ఆప్కాస్ కింద విధుల్లోకి తీసుకున్నారు. వీరికి 2020, ఆగస్టు నుంచి నెలనెలా 6 వేల రూపాయాలను ఆరోగ్యపరంగా ఎదురయ్యే సమస్యల దృష్ట్యా ఖర్చుల నిమిత్తం మంజూరు చేస్తున్నారు.
ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ప్రతి నెలా జీతంతో పాటు భత్యాన్ని కూడా ఇవ్వాలి.. కానీ సరైన సమయానికి ఇవ్వడం లేదు. మూడు, నాలుగు నెలలకోసారి విడుదల చేస్తున్నారు. ఈ ఏడాది జనవరి నుంచి ఇది కూడా ఇవ్వడం నిలిపివేశారు. గత ఐదు నెలలుగా రెండు జిల్లాల్లోని కార్మికులకు మొత్తం రూ.13.50 కోట్ల వరకు పెండింగ్ ఉంది. దీనికి సంబంధించి మున్సిపల్ కమిషనర్ల నుంచి ఆప్కాస్కు వివరాలు వెళ్లినా ఇంత వరకు మంజూరుకు నోచుకోలేదు.
కనీసం ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి తమ జీత భత్యాలను తమకు నెల నెలా ఇస్తే బాగుంటుందని పారిశుద్ధ్య కార్మికులు కోరుతున్నారు.