రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలపై ప్రజల్లో సమగ్ర అవగాహన కల్పించేందుకు సమాచార పౌర సంబంధ శాఖ అధికారులు, సిబ్బంది అంకిత భావంతో పనిచేయాలని రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ టి. విజయకుమార్ రెడ్డి సూచించారు.. జిల్లాల పునర్ వ్యవస్థీకరణ అనంతరం నూతన జిల్లాల్లో సమాచార పౌర సంబంధ శాఖ కార్యాలయాల ఏర్పాటు, అధికారులు సిబ్బంది విధుల సమన్వయం అంశాలను పరిశీలించేందుకు ఆయన ఏలూరు, పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి జిల్లాల్లో పర్యటించారు. కాకినాడ లోని జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి కార్యాలయాన్ని సందర్శించి, అనంతరం స్థానిక ఆర్ అండ్ బి అతిధి గృహం జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి కార్యాలయ సిబ్బందితో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ ఆశయాలు, లక్ష్యాలను ప్రజలకు, ప్రజల ఆకాంక్షలను ప్రభుత్వానికి తెలియజేసే వారధిలా సమాచార పౌర సంబంధాల శాఖ పనిచేయాలన్నారు.
మారుతున్న మీడియా ప్రసార శైలి, అవసరాల కనుగుణంగా మరింత వేగంగా సమాచార సేవలు అందించేందుకు సమాచార శాఖలోని పిఆర్ఓ, ఇంజనీరింగు విభాగాలను ఏకీకృతం చేసి సాంకేతికంగాను, సిబ్బంది పరంగాను పటిష్ఠపరుస్తున్నామని తెలిపారు. ప్రజలకు మెరుగైన సమాచార సేవలను అందించేందుకు మీడియాతో సుహృద్భావ సంబంధాలు పెంచుకోవాలన్నారు. అలాగే మీడియా ప్రతినిధులకు ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలు, సంక్షేమాలు అర్హులైనవారందరికి త్వరితగతిన అందించాలని సూచించారు. .