వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు కారులో మృతదేహం కలకలం రేపుతోంది. ఎమ్మెల్సీ కారులో అనుమానాస్పదంగా యువకుడి మృతదేహం లభించింది. ఆ యువకుడ్ని గతంలో ఎమ్మెల్సీ దగ్గర డ్రైవర్‌గా పనిచేసిన సుబ్రమణ్యంగా గుర్తించారు. నిన్న రాత్రి తమ కొడుకును ఎమ్మెల్సీ తీసుకెళ్లారని కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. అయితే అర్ధరాత్రి రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడంటూ మృతదేహాన్ని ఎమ్మెల్సీ కారులో తీసుకొచ్చారు. బాధితుల ఆందోళనతో అనంతబాబు కారు వదిలి వెళ్లిపోయారు. సుబ్రమణ్యంను హత్య చేశారంటూ కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఏం జరిగిందంటే ?
ఎమ్మెల్సీ అనంత ఉదయ్‌భాస్కర్ నిన్న ఉదయం కారులో తనతో పాటు డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని తీసుకెళ్లారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు. ప్రమాదం జరిగిందంటూ డ్రైవర్ తమ్ముడికి.. సమాచారం ఇచ్చారు ఎమ్మెల్సీ ఉదయ్‌భాస్కర్. ఆ తర్వాత తన కారులోనే డ్రైవర్ మృతదేహాన్ని తీసుకొచ్చిన ఎమ్మెల్సీ.. తెల్లవారుజామున 2 గంటలకు మృతదేహాన్ని అతని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఏం జరిగిందని కుటుంబ సభ్యులు అడగ్గా ప్రమాదం జరిగిందని ఎమ్మెల్సీ చెప్పారని, సరైన సమాధానం చెప్పాలని అడగ్గా మృతదేహాన్ని కారులోనే వదిలేసి, వేరే కారులో వెళ్లిపోయారని మృతుని బంధువులు తెలిపారు. దీంతో తమకు న్యాయం చేయాలని కుటుంబసభ్యులు ఆందోళన చేస్తున్నారు. మృతుడు సుబ్రహ్మణ్యం ఎమ్మెల్సీ వద్ద ఐదేళ్లుగా డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఇప్పుడు ఉన్నట్టుండి మరణించడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది…!!
ఎమ్మెల్సీ అనంత బాబును తక్షణమే అరెస్ట్ చేయాలి : నారా లోకేష్
ఏపీని బీహార్ కంటే దారుణమైన రాష్ట్రంగా మార్చేసింది వైసిపి మాఫియా. వైసిపి నాయకుల నేరాలు, ఘోరాలకి సామాన్యులు బలైపోతున్నారు. తన వద్ద డ్రైవర్ గా పని
చేస్తున్న సుబ్రహ్మణ్యంని అత్యంత దారుణంగా హత్య చేసిన ఎమ్మెల్సీ అనంతబాబు, యాక్సిడెంట్ గా చిత్రీకరించే ప్రయత్నం చేయడం రాష్ట్రంలో జరుగుతున్న రాక్షస క్రీడకు అద్దం పడుతోంది. ఎమ్మెల్సీ అనంతబాబు తమ కుమారుడ్ని బలవంతంగా తీసుకెళ్లి హత్య చేశాడని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నా అతన్ని పోలీసులు ఎందుకు అరెస్టు చేయలేదు. వైసిపి ప్రజా ప్రతినిధులు, నాయకులకు హత్యలు, అరాచకాలు చేసుకోమని స్పెషల్ లైసెన్స్ ఏమైనా ప్రభుత్వం ఇచ్చిందా ? సుబ్రహ్మణ్యంని హత్య చేసిన ఎమ్మెల్సీ అనంతబాబు, అతని అనుచరులను తక్షణమే అరెస్ట్ చేయాలి. హత్యపై సీబీఐ ఎంక్వైరీ వేయాలి. ఎంతో భవిష్యత్తు ఉన్న కొడుకుని కోల్పోయిన ఆ తల్లిదండ్రులను ప్రభుత్వం ఆదుకోవాలి.