తెలుగు ప్రజల ఆరాధ్య దైవమైన విశ్వ విఖ్యాత నటసార్వభౌమ, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు శత జయంతి ఉత్సవాల లోగోను టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ ఆవిష్కరించారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు రాజకీయంగా తన వ్యూహాలకు పదును పెడుతున్నారు. 2024 ఎన్నికల్లో తిరిగి అధికారం దక్కించుకోవడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు. అందులో భాగంగా ఇప్పటికే అన్ని నియోజకవర్గాలకు ఇంచార్జిలా నియామకంతో పాటుగా దూరంగా ఉన్న నేతలను పార్టీలో క్రియాశీలకం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదే సమయంలో నందమూరి కుటుంబం మొత్తాన్ని ఒకే వేదిక మీదకు తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అందులో భాగంగా ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు మే 28వ తేదీ నుంచి నిర్వహించేందుకు నిర్ణయించారు.
ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు
మహానాడు ఘనంగా నిర్వహించటం ద్వారా పార్టీ పూర్వ వైభవానికి అక్కడ నుంచే నాంది పలకాలని భావిస్తున్నారు. ఎన్టీఆర్ సెంటినరీ సెలెబ్రేషన్స్ కావటంతో ఈ ఏడాది మహానాడుతో మొదలు పెట్టి ఏడాది పాటు నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది. వచ్చే నెల నుంచి పార్టీ సభ్యత్వ నమోదు ప్రారంభించనున్నారు. యాప్ ద్వారా సభ్యత్వం తీసుకొనే వెసులుబాటు కలిగిస్తోంది. రూ. 100 సభ్యత్వ రుసుముగా ఖరారు చేసింది. సభ్యులందరికీ ప్రమాద భీమ సదుపాయం కల్పిస్తోంది. ఇక, ఇదే వేదిక ద్వారా 2024 ఎన్నికల సమరానికి సమర శంఖం పూరించాలని పార్టీ అధినాయకత్వం భావిస్తోంది.
ఎన్టీఆర్ శత జయంతి నాడు నందమూరి కుటుంబ సభ్యులను పార్టీ వేదికగా ఒకే చోటకు తీసుకొచ్చే అవకాశం కనిపిస్తోంది. బాలయ్య జూనియర్ ఎన్టీఆర్ సైతం మహానాడుకు వస్తారని అంచనా వేస్తున్నారు. అందరూ ఒకే నినాదంతో 2024 ఎన్నికల్లో పార్టీకి అండగా నిలిచేలా మహానాడు వేదిక ద్వారా సంసిద్దులను చేయాలని భావిస్తున్నారు. ఆ తరువాత ఏడాది పాటు ఎన్టీఆర్ శతజయంతి వేడుకలను ప్రతీ నియోజకవర్గంలో నిర్వహించే ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తోంది. మొత్తంగా 2024 ఎన్నికలకు మహానాడు ద్వారా పార్టీని సిద్దం చేయాలని టీడీపీ అధినాయకత్వం భావిస్తున్నట్లుగా కనిపిస్తోంది.