రైతుల సమస్యలను తీర్చేందుకే రైతుభరోసా కేంద్రాలను ఏర్పాటు చేసామని గొప్పలు చెప్పుకుంటున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం….. రెండు, మూడు నెలలకు గానీ రైతు ఖాతాల్లో సొమ్మును జమ చెయ్యట్లేదని ఓ సర్వేలో వెల్లడయ్యింది.
రైతు భరోసా కేంద్రాల ద్వారానే ధాన్యం కొనుగోలు చేస్తున్నామని ప్రభుత్వం గొప్పలు చెబుతున్నా.. రాష్ట్రంలో నూటికి 90% పైగా రైతులు ఈ రోజుకీ మిల్లర్లకే ధాన్యాన్ని అమ్ముకోవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ఆర్‌బీకేల పక్కన ఇళ్లలో ఉండే రైతులు తమ ధాన్యాన్ని రోజుల తరబడి ఆరబెట్టి మిల్లులకు తీసుకు వెళ్ళడం తప్పడం లేదని రైతులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మిల్లుకు వెళ్ళిన తర్వాత ధాన్యం బాగున్నా కూడా మిల్లర్లు బస్తాకు 80 రూపాయల నుంచి 100 రూపాయల వరకు తగ్గించి ఇస్తున్నారని రైతులు గగ్గోలు పెడుతున్నారు. తేమ, నూక శాతంలో తేడా ఉంటే 200 రూపాయల వరకు తగ్గించి ఇస్తున్నారు . అయితే లెక్క ప్రకారం… అయిదెకరాల్లో వరి సాగు చేసే రైతుకు 150 బస్తాల దిగుబడి వస్తే.. దాదాపు 30వేల రూపాయల వరకు నష్టపోతున్నారు. ధాన్యం సేకరణలో హమాలీ, రవాణా ఖర్చులను కూడా ప్రభుత్వమే భరిస్తుంది. కానీ … ఈ విషయం అధిక శాతం రైతులకు తెలియక పోవడం గమనార్హం. తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కోనసీమ, ఏలూరు జిల్లాల్లో ఒక సంస్థ నిర్వహించిన సర్వేలో ఈ విషయాలు బయటపడ్డాయి. ధాన్యం అమ్మకాల్లో రైతులు పడుతున్న అవస్థలు, దోపిడీకి గురవుతున్న తీరు వెల్లడైంది. రైతు భరోసా కేంద్రాల్లో రైతుకు ఎలాంటి భరోసా దక్కడం లేదనే విషయం ఈ సర్వే లో స్పష్టమయ్యింది..