ఏపీ సీఎం వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఆకాంక్షల మేరకు స్విమ్స్‌ను రాష్ట్రంలోనే అత్యుత్తమ వైద్యసంస్థగా అభివృద్ధి చేస్తామని టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు వైవి.సుబ్బారెడ్డి తెలిపారు. స్విమ్స్ ప్రాంగణంలోని శ్రీ పద్మావతి ఆడిటోరియంలో శుక్రవారం డాక్టర్స్ ఫర్ యు, హెచ్.డి.ఎఫ్.సి సంస్థలు రూ.ఐదు కోట్ల వ్యయంతో విరాళంగా అందించిన అధునాతన వైద్యపరికరాల ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఛైర్మన్ మాట్లాడుతూ సిఎం ఆదేశాలకు అనుగుణంగా స్విమ్స్‌కు తోడ్పాటును అందించాలనే ఉద్దేశంతో టిటిడిలో విలీనం చేసినట్టు చెప్పారు. దాతల సహకారంతో అన్ని విభాగాలలోను అధునాతన వైద్యపరికరాలను సమకూర్చనున్నట్టు తెలిపారు. ఆసుపత్రికి అవసరమైన రూ.5 కోట్లు విలువైన వైద్యపరికరాలు విరాళంగా అందించిన డాక్టర్స్ ఫర్ యు, హెచ్.డి.ఎఫ్.సి సంస్థల ప్రతినిధులకు అభినందనలు తెలియజేశారు. వీటిలో ఐసీయూలో వెంటిలేటర్లకు సహాయంగా ఉండేందుకు, కోవిడ్ వ్యాధిగ్రస్తులకు ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని పెంచేందుకు 10 హై ఎండ్ మల్టీపారా మానిటర్లు, 20 మిడ్ రేంజ్ మల్టీపారా మానిటర్లు, 50 పల్స్ ఆక్సీ మీటర్లు ఉన్నాయన్నారు. అదే విధంగా 10 వెంటిలేటర్లు, ఒక నియోనెటల్ వెంటిలేటర్, 100 ఫాలర్ కోట్స్ ఆటోమేటిక్ విత్ మాట్రిసెస్, 25 డయాలసిస్ యంత్రాలు, 2 అల్ట్రాసౌండ్ యంత్రాలు తదితర వైద్య పరికరాలు విరాళంగా అందించినట్టు తెలియజేశారు. స్విమ్స్‌లో మరింత మెరుగైన వైద్యసేవలు అందించేందుకు కృషి జరుగుతోందని, ఇందులో భాగంగా ఇక్కడున్న 100 పడకల క్యాన్సర్ విభాగాన్ని 300 పడకలకు పెంచాలని ముఖ్యమంత్రి వైఎస్.జగన్ ఆదేశం మేరకు దాతల సహకారంతో ఈ పనులు త్వరలో పూర్తి చేస్తామని చెప్పారు.
ఉపముఖ్యమంత్రి కె.నారాయణస్వామి మాట్లాడుతూ కోవిడ్ మహమ్మారి బారినపడిన వారికి వైద్యసేవలు అందించడం ద్వారా స్విమ్స్ సంస్థ ప్రత్యేక గుర్తింపు పొందిందన్నారు. వైద్యసేవలతోపాటు వైద్య విద్య, వైద్య పరిశోధన, సామాజిక సేవ కార్యక్రమాలు అమలుపరచడంలో స్విమ్స్ ప్రథమ స్థానంలో ఉందని తెలిపారు. దాతలకు అభినందనలు తెలిపారు. ఈ అధునాతన పరికరాల ద్వారా మరింత మంది పేదరోగులకు అత్యవసర వైద్యం అందించవచ్చని చెప్పారు.
తిరుపతి పార్లమెంటు సభ్యులు డాక్టర్ ఎం.గురుమూర్తి మాట్లాడుతూ తాను కూడా ఈ కళాశాలలోనే చదువుకున్నానని, వైద్యులందరూ ఎంతో గొప్ప సంస్థగా భావిస్తారన్నారు. ఎంతో మంది పేద రోగులకు ఈ ఆసుపత్రి ఒక వరంలాంటిదన్నారు. ఈ ఆసుపత్రి అభివృద్ధితో పాటు విమానాశ్రయం పక్కన గల స్విమ్స్ స్థలంలో అభివృద్ధి కార్యక్రమాలు జరగాలని ఆకాంక్షించారు.
తిరుపతి శాసనసభ్యులు భూమన కరుణాకర్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రాన్ని ఆరోగ్యాంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దాలన్న ముఖ్యమంత్రి వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డిగారి ఆశయం మేరకు స్విమ్స్‌ను అత్యుత్తమ వైద్యవిద్యాసంస్థగా అంతర్జాతీయ ప్రమాణాలతో టిటిడి తీర్చిదిద్దుతోందన్నారు. ఇక్కడ అధునాతన వైద్యసేవలు అందుతున్నాయని తెలిపారు. దాతలకు అభినందనలు తెలిపారు. అనంతరం స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ బి.వెంగమ్మ విరాళ దాతలకు ఘనంగా సన్మానించి కృతజ్ఞతలు తెలియజేశారు. అతిథులను దుశ్శాలువతో సన్మానించి జ్ఞాపికలను అందజేశారు.