ఏపీలో వ్యవసాయసాయ పంపు సెట్లకు విద్యుత్ మీటర్లు బిగించడం రైతుల మెడలకు ఉరితాళ్లు బిగించడమేనని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ పేర్కొన్నారు. ఈ మేరకు సీపీఐ, రైతు సంఘం, ఇతర అనుబంధ సంఘాల నాయకులు శుక్రవారం అనంతపురంలో వినూత్న నిరసన కార్యక్రమం చేపట్టారు. ఎద్దుల బండి పై ఇద్దరు రైతులు ఉరికొయ్యలకు వేలాడుతున్నట్టుగా నిరసన ప్రదర్శన చేశారు. అనంతరం పాతఊరు విద్యుత్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. జాతీయ కార్యదర్శి నారాయణ మాట్లాడుతూ వ్యవసాయ పంపుసెట్లకు విద్యుత్ మీటర్లు బిగించే రైతు వ్యతిరేక కార్యక్రమం దేశ వ్యాప్తంగా బీజేపీ పాలిత ప్రాంతాల్లో ఎక్కడా అమలు చేయడం లేదని గుర్తు చేశారు. ప్రధాని మోదీకి ఏపి సీఎం జగన్ దత్తపుత్రుడని కమలనాథులు కాళ్ళతో చెబితే జగన్ తలతో పనులు చేస్తున్నాడని ఎద్దేవా చేశారు. గతంలో ప్రపంచ బ్యాంకు ఆదేశాలను అమలు చేస్తూ ఇలాంటి రైతు వ్యతిరేక విధానాలను, విద్యుత్ సంస్కరణలను చేపట్టిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వామపక్షాలు చేసిన పోరాటం గుర్తు చేసుకోవాలని సీఎం జగన్ కు హితవు పలికారు.అన్నదాతల పట్ల సీఎం జగన్ తన వైఖరిని మార్చుకోకపోతే వారి ఆగ్రహానికి బంగాళాఖాతంలో మునిగిపోతాడని ఆగ్రహాం వ్యక్తం చేశారు.
రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తామని,ప్రజలకు కరెంటు, బస్సు ఛార్జీలు పెంచబోమని 2019 ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన వై ఎస్ జగన్ అప్పటి టీడిపి ప్రభుత్వాన్ని బాదుడే బాదుడు అంటూ విమర్శించి ప్రస్తుతం మోదీ చేతిలో కీలుబొమ్మగా మారాడని దుయ్యబట్టారు. ప్రధాని మోదీకి సీఎం జగన్ భయపడుతున్నాడు కనుకనే దేశంలో బీజేపీ పాలిత ప్రాంతాల్లో ఏ.రాష్ట్రంలో కూడా అమలు చేయని విద్యుత్ సంస్కరణలను ఏపి లో అమలు చేసే ప్రయత్నం చేస్తున్నారని ఘాటుగా వ్యాఖ్యానించారు.జగన్ తన రాజ్యాధికారం కోసం రైతులను బలిస్తున్నాడని మండిపడ్డారు. శ్రీకాకుళంలో వ్యవసాయ పంపు సెట్లకు మీటర్లు బిగించడంతో 30 శాతం ఆదాయమొచ్చినట్లు వైసీపీ మంత్రులు చెబుతున్నారని ఆ ప్రజలే తగిన గుణపాఠం నేర్పుతారని ఏకరువు పెట్టారు.కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏపి ప్రజలపై కక్ష గట్టాయని ప్రధాని మోదీ, సీఎం జగన్ లు రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచుతున్నారని విమర్శించారు.ప్రధాని మోదీ కేవలం అంబానీ,అదానీల కార్పొరేట్ కంపెనీలకు దేశాన్ని దోచిపెడుతున్నాడని అసహనం వ్యక్తం చేశారు.భారతదేశ విద్యుత్ అవసరాలకు బొగ్గు దిగుమతి అవసరం కావడంతో ప్రతి రాష్ట్రం దిగుమతి చేసుకునే విధంగా ఆంక్షలు విధిస్తున్నారని విచారం వ్యక్తం చేశారు.
ప్రపంచ దేశాల్లో బొగ్గు గనులు అదానీ నాయకత్వంలో ఉన్నాయని బొగ్గు రాష్ట్రానికి రావాలంటే ఆయన ఓడరేవుల నుండే రావాలని తద్వారా అదానీ వ్యాపారం పెరుగుతుందన్నారు.ఇలా రాష్ట్రాల ఆదాయాన్ని దెబ్బ గొట్టే రీతిలో కేంద్ర ప్రభుత్వం పరిపాలన కొనసాగిస్తుందని తూర్పారబట్టారు. కేంద్ర ప్రభుత్వం కేవలం కార్పొరేట్ దిగ్గజాలైన అంబానీ,అదానీ ల కోసమే దేశాన్ని ధారాదత్తం చేస్తోందని నిప్పులు చెరిగారు. విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు, ఓడరేవులు,విమానాశ్రయాలు, సిమెంట్ ఫ్యాక్టరీలు,స్టీల్ పరిశ్రమలను ప్రధాని మోదీ అంబానీ అదానీ లకు అప్పజెప్పి భారత ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేశాడని దుమ్మెత్తి పోశారు.దేశ వ్యాప్తంగా ఆర్థిక సంక్షోభాన్ని సృష్టించి రైతాంగాన్ని ఆత్మహత్యలకు పురికొల్పే దిశలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలను సీపీఐ పూర్తిగా వ్యతిరేకిస్తోందని స్ఫష్టం చేశారు.ప్రజానీకానికి కల్లబొల్లి మాటలు చెప్పి ప్రభుత్వాధికారులు, మంత్రులు,వారి తాబెదారులు మోసం చేసేపనిలో పడ్డారని ఎట్టి పరిస్థితుల్లోనూ వ్యవసాయ పంపుసెట్లకు విద్యుత్ మీటర్లు బిగించనివ్వమని తేల్చి చెప్పారు.వైసీపీ నాయకులు ప్రతిపక్షంలో వున్నప్పుడు ప్రజలకిచ్చిన హామీలనుగుర్తుకు తెచ్చుకోవాలని వారి నోట్లో ఉన్నవి నాలుకలా లేక తాటిమట్టలా అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.రాష్ట్రంలో వైసీపీ నేతల ఎత్తుగడలు సాగనివ్వమని రైతుల మోటార్లకు బిగించే మీటర్లు సీఎం జగన్ మెడకు ఉరితాళ్లుగా బిగుసుకుంటాయని రైతుల పక్షానపోరాటం కొనసాగిస్తామని నారాయణ హెచ్చరించారు.