– పథకాలకు మంగళం
– ఇస్లామిక్ బ్యాంకు ఊసే లేదు
– మసీదులు, చర్చీల నిర్మాణానికి అందని నిధులు
– సంక్షేమం పేరుతో మోసం
పాదయాత్ర చేసే సమయంలో జగన్మోహన్రెడ్డి ఎన్నో హామీలు ఇచ్చారు. నవరత్నాలు అంటూ ఆశ చూపించారు. ప్రతీ ఒక్క వర్గానికి మేలు చేస్తామని చేతిలో చెయ్యేసి, నుదిటిపై ముద్దులు పెట్టి మరీ గద్దె నెక్కారు. గత ప్రభుత్వ హయాంలో ముస్లిం మైనారిటీలకు జరగని ఎన్నో మేళ్లు చేస్తామంటూ వాళ్ళ వోట్ బ్యాంకుని తనవైపు మళ్లించుకుని ముఖ్యమంత్రి అయ్యారు. కానీ ఎం లాభం ? మా మైనారిటీల కోసం ఈ ప్రభుత్వం ఏం చేసింది అంటూ ముస్లిం సోదరులు ప్రశ్నిస్తున్నారు.
అధికారం చేజిక్కించుకున్నాక ఉన్న పథకాలకు మంగళం పాడేసి కొత్త పధకాలను తీసుకొచ్చారు. వాటినన్నా సక్రమంగా అమలు చేస్తున్నారా అంటే అదీ లేదు. గద్దెనెక్కాక ఏం చేయకపోతే బాగోదని మైనారిటీలకు స్వయం ఉపాధి యూనిట్లు అందిస్తామంటూ దరఖాస్తులను ఆహ్వానించారు, ఇంటర్వ్యూలకు కూడా పిలిచారు. కాలం గడిచే కొద్దీ ఈ మొత్తం ప్రక్రియను అర్ధంతరంగా నిలిపివేశారు. ఇదేమిటని ప్రశ్నించిన మైనారిటీలకు నవరత్నాలు ఇస్తున్నాం కాబట్టి ఇంక స్వయం ఉపాధి యూనిట్లు ఇవ్వాల్సిన అవసరం లేదంటూ తేల్చేసింది. ప్రతీ ఒక్క కులానికి ప్రత్యేకంగా కార్పొరేషన్ పెట్టి నిధులు ఇస్తామని మభ్యపెట్టి తర్వాత ఎలాగైతే మొండిచెయ్యి చూపించారో వాటిల్లాగే ముస్లిం మైనారిటీ, క్రిస్టియన్ కార్పొరేషన్లు కూడా పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా మిగిలిపోయాయి.
గత ప్రభుత్వం 2019-20లో బడ్జెట్‌లో ముస్లిం మైనారిటీల్లోని దూదేకుల కుల సంక్షేమం కోసం ఒక ఫెడరేషన్ ఏర్పాటుచేసి దానికి రూ.20 కోట్లు కేటాయించింది. ప్రస్తుత ప్రభుత్వం వచ్చాక అప్పటి నిధుల్లోంచి 1.40 కోట్లు మాత్రమే ఖర్చు చేసి ఆ తర్వాతి బడ్జెట్‌లో మాత్రం ఒక్క పైసా కూడా కేటాయించలేదు సరికదా అసలు ఆ ఫెడరేషన్ ఊసే ప్రభుత్వం మరిచిపోయింది.
2014 లో అధికారంలోకి రావడం కోసమే టీడీపీ ‘ఇస్లామిక్ బ్యాంక్’ ఏర్పాటు చేస్తామని చెప్పింది అని కానీ ఎలాంటి బ్యాంకును ఏర్పాటు చేయలేదని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్ ఎద్దేవా చేశారు. ఇదే విషయాన్నీ తన పాదయాత్రలో భాగంగా ఊరూరా తిరుగుతూ విమర్శలు గుప్పించారు. ఇక తాము అధికారంలోకి వస్తే ముస్లింల కోసం తప్పనిసరిగా ఇస్లామిక్ బ్యాంకును ఏర్పాటు చేస్తామని అరచేతిలో వైకుంఠాన్ని చూపించారు. జగనన్న తమ కష్టాలు విన్నాడు, చూసాడు, ఏదైనా మంచే చేస్తాడని నమ్మి జనం ఆయనకు అండగా నిలబడితే ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత వాటి సంగతే మర్చిపోయారు. అప్పటికే ఉన్న స్వయం ఉపాధి పథకాలకూ కూడా గుడ్ బై చెప్పేసారు. గత ప్రభుత్వం ఇచ్చిన రంజాన్ తోఫా , బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ , దుల్హన్ పధకాలు ఏమైపోయాయో తెలీదు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న చర్చిలు, మసీదుల మరమ్మత్తులు, నిర్మాణాల కోసం గత ప్రభుత్వం ఒక్కో జిల్లాకు రూ.2.50 కోట్ల నిధులను మంజూరు చేసింది. కానీ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక షాదీఖానాలకు రూ.10 కోట్లు మాత్రం కేటాయించి చేతులు దులుపుకుంది. మిగతా నిర్మాణాలు ఎలా పూర్తి చేయాలో అధికారులకు అర్థం కాక తలలుపట్టుకుంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం మైనారీటాలకు మేలు చేయాలని మైనారిటీ వర్గాలు కోరుతున్నాయి.