ఇటు ఆంధ్రప్రదేశ్ – అటు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై జనసేన ఫోకస్ పెట్టిన వేళ కీలక పరిణామం సంభవించింది. ముగ్గురు మెగా హీరోల అభిమానుల భేటీ రాజకీయ వేడిని రాజేస్తోంది. మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కల్యాణ్, మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ ఫ్యాన్స్ విజయవాడలో భేటీ అయ్యి చర్చించడం హాట్ టాపిక్‌గా మారింది.
తెలుగు రాష్ట్రాల ఎన్నికలపై పవన్ ఫోకస్ పెట్టిన నేపథ్యంలో ముగ్గురు మెగా హీరోల అభిమానులు విజయవాడలో భేటీ కావడం చర్చనీయాంశమయ్యింది. ఏపీలోని అన్ని జిల్లల నుంచి మెగా అభిమానులు ఈ సమావేశానికి హాజరైనట్లు తెలుస్తోంది. జనసేనకు మద్దతుగా నిలిచే అంశంపైనే ప్రధానంగా చర్చిస్తున్నట్లు సమాచారం. చిరంజీవి, పవన్, రామ్‌చరణ్ అభిమానులు జనసేన బలోపేతానికి చేయాల్సిన దానిపై ప్రణాళికలు సిద్ధం చేసినట్లు సమాచారం. సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం వంటి అంశాలపై చర్చించి, పక్కా ప్రణాళికతో ముందుకెళ్లాలని భావిస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసినా జనసేనకు ఘోర భంగపాటు తప్పలేదు . రాష్ట్రవ్యాప్తంగా భారీగా అభిమానులు ఉన్నారు. కాపు సామాజికవర్గం మద్దతు కూడా బాగా ఉంది. సభలు, సమావేశాలకు భారీగా జనం హాజరయ్యారు అనే లెక్కలు చుస్తే గనక పవన్ పార్టీకి గౌరవప్రదమైన సీట్లు రావాల్సి ఉంది, కానీ వైసీపీ అధినేత జగన్ గాలి ముందు, గాజుగ్లాసు ముక్కలైంది. అధినేత పవన్ కళ్యాణ్ సైతం పోటీ చేసిన రెండు సీట్లలో ఓడిపోయారు. ఇది నిజంగా మెగా అభిమానులకు పెద్ద అవమానమే. అయితే ఆ పార్టీ బోణీ అయితే చేసింది. రాజోలు నుంచి జనసేన అభ్యర్థి విజయం సాధించారు. కాకపోతే అది మూణ్ణాళ్ళ ముచ్చటే అయ్యింది. ఫలితాలు వచ్చిన కొన్ని నెలలకే రాపాక బోర్డు తిప్పేశారు. సీఎం జగన్ కు జై కొట్టారు. తరువాత పూర్తిగా వైసీపీ ఎమ్మెల్యేగానే వ్యవహరిస్తున్నారు. అయితే అదంతా గతమంటున్నారు మెగా అభిమానులు. ఈసారి మెగా ఫ్యాన్స్ పవర్ ఏంటో చూపిస్తామంటున్నారు ? కచ్చితంగా అధికారంలోకి వచ్చి తీరుతామంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు.
అఖిల భారత చిరంజీవి అభిమాన సంఘాధ్యక్షుడు స్వామి నాయుడు మాట్లాడుతూ జనసేనను అధికారంలోకి ఎలా తీసుకురావాలనే అంశంపై సమావేశంలో చర్చించినట్లు తెలిపారు. మెగా అభిమానులు అందరినీ ఏకతాటి పైకి తీసుకొస్తామని, నాగబాబు త్వరలో అభిమానులందరితో ప్రత్యేకంగా భేటీ అవుతారని స్పష్టం చేశారు. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసే దిశగా మెగా అభిమానులు చురుకైన పాత్ర పోషించాలని కోరారు. 2024లో పవన్ కళ్యాణ్ ను సీఎంని చేయడమే లక్ష్యంగా, జనసేన పార్టీ అధికారంలోకి వచ్చేలా ప్రణాళికబద్దంగా పనిచేస్తామన్నారు. మరికొన్ని సమావేశాల అనంతరం కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. అభిమానులకు, నాయకులకు మధ్య అంతరాలు లేవని స్పష్టం చేశారు.