‘గడప గడపకు ప్రభుత్వం’ కార్యక్రమంలో తమ సమస్యను ప్రజాప్రతినిధులకు తెలిపేలా సీపీఎస్ ఉద్యోగులు ప్లకార్డులు ప్రదర్శించారు. తమ గడపకు రావాలంటే, జగన్ ఇచ్చిన హామీ మేరకు సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలని పలకలు, అట్టలపై రాసిన బోర్డును ఇంటి గేటు ముందు పెట్టారు. సిపిఎస్ రద్దు చేసి మా గడప తొక్కండి అంటూ ఆంధ్రప్రదేశ్ సీపీఎస్ ఎంప్లాయ్ అసోసియేషన్ ఉమ్మడి కృష్ణాజిల్లా అధ్యక్షుడు శ్యాంబాబు ఇంటి గేటుకు బోర్డు ఏర్పాటు చేశారు. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన గుర్రం మురళీమోహన్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. గడప గడపలో సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలనే బోర్డులను ఉద్యోగులు పెట్టాలని కోరారు. విశాఖ జిల్లా అనకాపల్లిలోనూ ఓ ఉపాధ్యాయుడు సీపీఎస్ ను రద్దు చేయాలని బోర్డు పెట్టారు. బాపట్ల జిల్లా అద్దంకిలోని దామావారిపాలేనికి చెందిన ఉపాధ్యాయుడు నాగేశ్వరరావు సీపీఎస్ రద్దు కోసం పోరాడుతున్నారు. అద్దంకిలో నాగేశ్వరరావు తన ఇంటి గేటుకు బోర్డు ఏర్పాటుచేశారు. మరికొందరు ఉద్యోగులు కూడా ఇలానే నిరసన తెలిపేందుకు సిద్ధమవుతున్నారని నాగేశ్వరరావు తెలిపారు. రాష్ట్రంలో గడపగడపకు కార్యక్రమంలో ఉద్యోగుల నుంచి నిరసనలు వ్యక్తమవుతున్నాయి. సీపీఎస్ రద్దు చేస్తానని సీఎం జగన్ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని కోరుతున్నారు. అప్పటివరకు మా ఇంటికి రావొద్దంటూ గేట్లకు ప్లకార్డులు కట్టారు. రాష్ట్రమంతా ఉద్యోగులంతా ఇదే విధంగా నిరసనను వ్యక్తం చేస్తున్నారు అన్నారు.