నిర్భయ మహిళా రక్షణ చట్టాలను పటిష్టంగా ఎందుకు అమలుచేయడం లేదు ?
జస్టిస్ వర్మ కమిషన్ సిపార్సులు ఎందుకు అమలుచేయటం లేదు ?
విమెన్ ట్రాఫికింగ్ లో దేశం రెండో స్థానం.. ఆంధ్రప్రదేశ్ మూడో స్థానంలో ఎందుకుంది ?
దళిత మహిళలపై దాడులు
45 నిమిషాలకోసారి కిడ్నాప్ జరుగుతుంటే ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవట్లేదు ?
గర్భిణులపై ఆగని గృహ హింస.. గతం కంటే 28%పెరుగుదల
చిన్నపిల్లలు, వృద్ధ మహిళలని కూడా వదలని వైనం
నేషనల్ క్రైమ్ బ్యూరో రికార్డ్స్ లో భయంగొల్పే నిజాలు
నిప్పులు చిమ్ముకుంటూ నింగికి నేనెగిరిపోతే నిబిడాశ్చర్యంతో మీరు.. నెత్తురు కక్కుకుంటూ నేలకు రాలిపోతే నిర్దాక్షిణ్యంగా మీరే.. అన్న శ్రీ శ్రీ మాటలు సమాజంలో నేటి మహిళల పరిస్థితికి అద్దం పడుతోంది. మహిళలు అంతరిక్షంలోకి ప్రవేశించి తమ సత్తా చాటుతున్న నేటి సమాజంలో మరో పక్క దుర్భరమైన జీవన విధానాన్ని గడుపుతూ గృహహింసను అనుభవిస్తూ సాగిస్తున్న బతుకు పోరాటం రెండు భిన్న ధ్రువాల్లా కనిపిస్తాయి. ఎంత పెద్ద చదువు చదివినా మహిళలకు వివక్ష మాత్రం తప్పడం లేదు. దీనికి కారణం ఆధిపత్య పురుష భావజాలం తప్ప మరొకటి కాదు. భారతదేశంలో నేషనల్ క్రైమ్ బ్యూరో రికార్డ్స్ చూస్తే అమ్మాయిల ఎగుమతిలో దేశం 2 వ స్థానంలో ఆంధ్రప్రదేశ్ 3 వ స్థానంలో ఉంది. అదేవిధంగా గంటకు నలుగురు స్త్రీలపై లైంగిక దాడులు 45 నిమిషాలకు దేశంలో ఏదో ఒక చోట మహిళలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయని అమ్నెస్టీ ఇంటర్నేషనల్ సంస్థలు చెబుతున్నాయి. అదేవిధంగా థామ్సన్ రాయిటర్స్ అలాగే మార్త ఫారెల్ ఫౌండేషన్ లెక్కల ప్రకారం భారతదేశంలో ఆడవాళ్లపై జరుగుతున్న దాడులు లెక్కలేనన్ని ఉన్నాయి. అసభ్యకరమైన చూపులు, సంజ్ఞలతో మహిళలపై జరిగే హింస 61 శాతం పెరిగిందని సాంఘిక మాధ్యమాల ద్వారా వేధించే ధోరణి 52 శాతం పెరిగిందని లెక్కలు చెబుతున్నాయి. అదేవిధంగా ఆఫీస్ వర్కింగ్ సమయాల్లో మహిళలపై దాడి 29 శాతం పెరిగిందని ఇదేవిధంగా పరిస్థితి ఉంటే సమాజంలో మహిళా భద్రతకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని సామాజిక శాస్త్రవేత్తలు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ప్రాచీన మధ్య మరియు ఆధునిక భారతదేశంలో మహిళా స్థితిగతులు
ప్రాచీన భారతదేశంలో మాతృస్వామ్య విధానంలో జీవనం గడిచేది. కుటుంబంలో మహిళలే ప్రధాన పాత్ర పోషించేవాళ్ళు. వ్యవసాయం కుటుంబ పోషణ అంతా వారి చేతుల్లోనే ఉండేది అర్దాంగిగా ఆడవారిని గుర్తించి వారికీ ప్రాధాన్యత ఇచ్చారు. ఎప్పుడైతే వేదకాలం మనుగడలోకి వచ్చిందో అప్పటినుంచి వారి మీద ఆంక్షలు అనేవి మొదలయ్యాయి. సతీసహగమనం, బాల్య వివాహాలు అమల్లోకి వచ్చి కట్టుబాట్లను ఎదిరిస్తే వారికి కొన్ని శిక్షలు విధించేవారు. గరుడ పురాణం ముఖ్యంగా కొన్ని స్త్రీ కట్టుబాట్లు తప్పితే నరకంలోకి వెళుతుందని చెప్పటం వేదకాలంలో స్త్రీలు కట్టుబాట్ల విషయంలో కచ్చితంగా ఉండటంతో పురుషాధిక్యత పెనవేసుకుపోయింది. బ్రాహ్మణ సమాజంలో ఇది మరీ ఎక్కువ ఉండేది. మధ్యకాలంలో సతి, బాల్యవివాహాలు జోరుగా ఉండేవి. ఈ కాలంలో మహిళలపై పీడన చాలా ఎక్కువగా ఉండేది. తదనంతరం ఆధునిక దేశంలో గతం తాలూకు ఛాయలు తీవ్రంగానే ఉన్న బ్రిటిష్ వారి పాలన వచ్చేసరికి కొన్ని మార్పులు చేర్పులకు భారతదేశం లోనైంది.
మహిళలు -చట్టాలు
హిందూ వితంతు మహిళా పునర్వివాహా చట్టం 1856 హిందూ స్త్రీలకు చిన్నప్పుడే బాల్య వివాహాలు చేయటం, దానివలన వారు ఇబ్బందులకు గురయ్యే వారు. అప్పటి ఆరోగ్య జీవన సూచిక ప్రకారం చిన్న వయసులోనే భర్త మరణించిన వారికి తిరిగి వివాహం చేసుకునే అవకాశం లేకుండా పోయేది. 1856 లో వచ్చిన హిందూ మహిళా పునర్వివాహ చట్టం భర్త చనిపోయిన వారు మళ్ళీ తిరిగి వివాహం చేసుకునే అవకాశం కల్పించారు. దీనితో ఒంటరి మహిళలకి ఎంతో ఊరట కలిగింది.
బాల్య వివాహ నిరోధ చట్టం 1929
బ్రిటిష్ కాలంలో చిన్న వయసులోనే వివాహాలు జరగడం, దీంతో వారి జీవన విధానం తీవ్ర ఇబ్బందులకు లోనవడం జరుగుతుండేది. దీనితో బ్రిటిష్ ప్రభుత్వం బాల్య వివాహ చట్టం తీసుకొచ్చింది. 14 సంవత్సరాలు నిండని ఆడపిల్లకు వివాహం చేయకూడదని ఆ చట్టం చెప్పింది. తదనంతరం వివాహ వయసును 18 కి పెంచటం జరిగింది. వరకట్న నిషేధిత చట్టం1961 లో తేవడం జరిగింది. ఆడపిల్లలు పెళ్ళికి కట్నం ఇవ్వడం, మగవారు తీసుకోవటం చట్ట ప్రకారం నేరంగా పరిగణించింది. తదనంతరం పిత్రార్జితపు ఆస్తిలో ఆడవారికి సమాన హక్కులు కల్పిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసిన చట్టం హర్షణీయం. అదేవిధంగా గృహహింస చట్టం 498(A) మహిళా భద్రతకు ప్రాధాన్యం ఇచ్చే విధంగా వుండి ఎంతో కొంత పీడనకు గురయ్యే మహిళలకు భద్రత కల్పించే చట్టంగా ప్రసిద్ధికెక్కింది.
విశాఖ vs స్టేట్ అఫ్ రాజస్థాన్
ఈ కేసులో భన్వరీ దేవి అనే మహిళ బాల్య వివాహాల రద్దు కోసం పోరాడుతూ ఉండేది. ఐతే అది గిట్టని కొంతమంది ఆమెని సామూహిక అత్యాచారం చేసినప్పుడు ఆమె తన హక్కుల కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. దిగువ కోర్ట్ లో న్యాయం జరగకపోయేసరికి సుప్రీమ్ కోర్ట్ ని ఆశ్రియించి విజయం సాధించింది. అప్పుడే కోర్ట్ మహిళా భద్రత కోసం కొన్ని మార్గదర్శకాలు చేయమని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
లక్ష్మి యూనియన్ అఫ్ ఇండియా
ఈ కేసులో యాసిడ్ దాడికి గురైన వ్యక్తికి ఉండే హక్కులు మహిళా భద్రతా కోసం చెప్పట్టాల్సిన మార్గదర్శకాలను కోర్ట్ నిర్దేశించింది. అదేవిధంగా ముస్లిం సమాజంలో తలాక్ ని నిషేధిస్తూ సుప్రీమ్ కోర్ట్ తీర్పు చెప్పింది..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళా భద్రతా
ఆంధ్రప్రదేశ్ లో మహిళల పరిస్థితి రోజురోజుకి దిగజారిపోతోంది. కర్నూల్ లో గంజాయి మత్తులో ఆరేళ్ళ చిన్నారి ఫై జరిగిన అత్యాచారం, అదేవిధంగా తాడేపల్లి లో రమ్యశ్రీ అనే బాలికపై దాడి, విశాఖ జిల్లాలో మహిళ పై అత్యాచారం, హత్య .. ఇలా చెప్పుకుంటూ పొతే ఆంధ్రప్రదేశ్ లో మహిళల భద్రతా ప్రస్నార్ధకంగా మారింది. దిశా యాప్ వలన చాలా కేసులు లెక్కలోకి వస్తున్నాయని దీంతో మహిళలకు భద్రత పెరిగిందని జగన్ ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటోంది. కానీ అవన్నీ వట్టి మాటలుగానే మిగిలిపోయాయి. దాడులకు గురైన వారికి ఇచ్చే నిర్భయ రిలీఫ్ ఫండ్ కూడా సరిగా ఇవ్వకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తుంది. ఇదంతా మహిళా భద్రతకు పెను సవాలుగా మారింది.
ఆంధ్రప్రదేశ్ లో బలహీన వర్గాలు – దళిత మహిళల పరిస్థితి
బీసీ కులాలు, దళిత వర్గాల మహిళలు రాష్ట్రంలో ఎంతో పీడనకు గురవుతున్నారని విశాఖ నగరంలో ఈ మధ్యకాలంలో రజక కులానికి చెందిన మహిళా పై దాడి జరిగిన నేపథ్యంలో కొన్ని బీసీ సంఘాలు మహిళా సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. దళిత మహిళలు ప్రతి చోట వివక్ష ఎదుర్కొంటు జీవనం సాగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీనికి తీసుకోవాల్సిన చర్యలు ఏంటంటే దిశా యాప్ ని సమర్థవంతంగా నడపాలి. పీడనకు గురైన వారికి ఇచ్చే నిర్భయ రిలీఫ్ ను ప్రభుత్వం వెంటనే ప్రకటించాలి. స్కూల్ కాలేజీలో కౌన్సిలింగ్ ఏర్పాటుచేయాలి. మగపిల్లలకు స్కూల్ కాలేజీలో ఎథిక్స్ మోరల్ విద్య నేర్పించాలి. బ్లూ ఫిలిం పోర్న్ వీడియోస్ పై కఠిన నియంత్రణ ఉండాలి. బడుగు, బలహీన వర్గాలు దళితులపై జరుగుతున్న దాడులపై కఠిన చర్యలు తీసుకోవాలి. మహిళలపై దాడులకు త్వరితగతిన ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటుచేయాలనీ చెప్పిన జస్టిస్ వర్మ కమిటీ సిఫార్సులను వెంటనే అమలుచేయాలి. ఏది ఎలా ఉన్న మహిళలపై దాడులు సమాజంలో నిత్యకృత్యంగా మారిపోయాయి. ఇటువంటి పరిస్థితి నుండి మహిళా సాధికారత కోసం పాటుపడే సమాజాన్ని సృష్టించుకుని తల్లిని, చెల్లిని పూజించే ఫలవంతమైన, ఆదర్శవంతమైన సమాజం వైపు మనం అడుగులు వేయాలని కోరుకుందాం.