“ఎక్కడైతే యువత దిశా నిర్దేశం,సామాజిక స్పృహ లేకుండా ఉంటారో ? ఆ సమాజం అభివృద్ధి వైపునకు కాకుండా తిరోగమనంలో ఉంటుంది” అన్నారు స్వామి వివేకానంద.
సామాన్యంగా యువత మత్తు పదార్థాలకు భానిసలు గా మారడం లేదా పోలీస్ లకు దొరికిపోవడం చూస్తూ ఉంటాం, కానీ మన ఆంధ్రప్రదేశ్ లో గత కొంత కాలంగా పాఠశాల విద్యార్థులు మత్తు పదార్థాలు సేవించి దొరకడం లాంటి వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. ముక్కుపచ్చలారని బాలబాలికలకు ఈ మాదక ద్రవ్యాల మహమ్మారి కబళించింది వేస్తుంది.మాదక ద్రవ్యాలను ఉచితంగా రుచి చూపిస్తూ నేరగాళ్లు విద్యార్థులను నెమ్మదిగా ఈ రొంపిలోకి దింపేస్తున్నారు. విద్యార్థులు క్రమంగా వాటికి అలవాటు పడుతూ మాదక ద్రవ్యాలకు భానిసలుగా మరియు సరఫరాదారులు గా మారుతున్నారు.
విజయవాడ పరిసర ప్రాంతాల్లోని కొన్ని పాఠశాల విద్యార్థులు మత్తు మందులు వినియోగిస్తున్నట్లు గత మూడు నెలలలోనే ఎనిమిది సార్లు వెలుగు చూసింది. తాజాగా విజయవాడలోని ఒక కార్పొరేట్ పాఠశాల లో ప్రహరీ గోడ అవతల నుండి పాఠశాల లోకి పొట్లాలు పడడం గమనించిన పాఠశాల సిబ్బంది, వాటిని తెరచి చూడగా అవి గంజాయి పొట్లాలు అని తేలడం తో విషయం బయటకు రాకుండా జాగ్రత్త పడ్డారు. తరువాత పోలీస్ ల సహాయంతో పాఠశాల చుట్టూ నిఘా పెట్టారు.
అలాగే విజయవాడలోని ఒక ప్రభుత్వ పాఠశాలలో 8 వ తరగతి చదువుతున్న ఒక విద్యార్థి బ్లాక్ బోర్డు వైపు చూస్తూ మగతగా నిద్రలోకి జారుకున్నాడు,అదే విషయాన్ని ఉపాధ్యాయులు పలుమార్లు గుర్తించారు, ఇలాగే కొంతమంది ఉన్నారు అని నిర్ధారించుకొని, ఆ పిల్లల పై నిఘా ఉంచగా విశ్రాంతి సమయంలో ప్రహరీ గోడ అవతల కొంతమంది చేరుతుండడంతో అనుమానిత విద్యార్థులను తనిఖీ చేయగా వారి వద్ద చిన్న గంజాయి పొట్లాలు దొరికాయి.
ఈ రెండు ఘటనలు ప్రత్యక్ష ఉదాహరణలు, ఇవే కాక బయటకు రాని అనేక సంఘటనలు విజయవాడ పరిసర ప్రాంతాలలో జరుగుతున్నాయి. విద్యార్థుల దగ్గర కేవలం గంజాయి మాత్రమే కాదు థిన్నర్, గోళ్ళ రంగులు, వైటనర్స్, సన్నని గొట్టాలు, పాలిథిన్ కవర్లు అధికంగా దొరుకుతున్నాయి అని ఉపాద్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కఠినంగా ఉండి చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వం
తూ తూ మంత్రంగా ఏవో కొన్ని చర్యలు తీసుకొని తల్లిదండ్రుల కన్నీళ్లు తుడుస్తున్నారు,పటిష్టమైన నిఘా ఉంచాల్సిన సర్కార్ కొద్ది మొత్తంలో గంజాయి పట్టుకొని గొప్పగా పేపర్ల లో వార్తలు వేపించుకుంటున్నారు, జాతీయ బాలల హక్కుల పరిరక్షణ సంఘం పాఠశాల విద్యార్థులు మత్తు పదార్థాలకు భానిసలు కావడం మీద ఆందోళన వ్యక్తం చేసింది, పటిష్ఠమైన కార్యాచరణ, ప్రణాళిక రూపొందించాలి అని సుప్రీం కోర్టు ఆదేశించింది, ప్రస్తుతం జరుగుతున్న సంఘటనలు చూస్తుంటే ఈ విషయంలో జగన్ సర్కార్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది అని చెప్పాలి, దేశ భవిష్యత్తుకు పునాదులు అయిన బాలలు ఇలా మత్తు పదార్థాల కు భానిసలు అయిపోతుంటే దేశ భవిష్యత్తు నిర్వీర్యం అయిపోతుంది అని తల్లిదండ్రులు,ప్రజలు బాధపడుతున్నారు.