– పంటలను నాశనం చేస్తున్న ఏనుగులు
– తగలబడుతున్న అడవులు
– సకాలంలో అందని నష్ట పరిహారం
– హామీలు గాలికి
– ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్న గిరిజనులు
గ్రామాల్లో ఏనుగులు సంచరిస్తూ పంటలను చేస్తున్నా అటవీశాఖ సిబ్బంది మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఏనుగుల దాడిలో ఎంతో మంది చనిపోయారు. అటవీ శాఖా నిర్వహణ మీద ఎలాంటి రివ్యూ లు కూడా సక్రమంగా చేయడం లేదు. ఈ 13ఏళ్లల్లో అంటే 2008 నుంచి ఇప్పటి వరకు చూస్తే దాదాపు 20 మంది ఏనుగుల దాడిలో మరణించారు. ఇవి లెక్కలోకి వచ్చినవి మాత్రమే. లెక్కలోకి రానివి ఇంకెన్నున్నాయో. పంటలు నష్టపోతున్న రైతులకు ఎటువంటి పరిహారం అందడం లేదు. రైతులు, ప్రజలు ఏనుగుల బారిన పడకుండా శాశ్వత పరిష్కారం చూపించాల్సిన అధికారులు, ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదు. ఎప్పుడు ఏం జరుగుతుందో అనే భయంతో జనం ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారు. గతంలో ఏనుగుల దాడిలో మరణించిన వారికి కానీ పంట నష్టపోయిన వారికి కానీ నష్ట పరిహారాన్ని ఇంకా పూర్తిగా అందించలేదు. అటవీ శాఖ మీదా ఎలాంటి రివ్యూలు కూడా గ్రౌండ్ లెవెల్ లో చేయడం లేదు. అటవీ శాఖలో ఉన్న ఖాళీలను కూడా భర్తీ చేయకపోవడం పై ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి కనిపిస్తోంది. అటవీ శాఖ రివ్యూ అంటే ఎర్రచందనం మీద మాత్రమే రివ్యూ చేస్తే సరిపోతుంది అనుకుంటోంది ప్రభుత్వం తప్ప ఇలాంటి సీరియస్ ఇష్యూస్ మీద మాత్రం ద్రుష్టి కేంద్రీకరించడం లేదు అనేది ఈ సంఘటన బట్టి తెలుస్తోంది. అటవీ శాఖ అధికారులకు సరైన ప్రణాళిక చర్యలు రూపొందించకుండా అక్కడ ఉండే గిరిజన ప్రజలను ఆ ప్రాంతం వదిలేసి వెళ్లాలంటూ వాళ్ళ మీద ఒత్తిడి తేవడం ఎంతవరకు సమంజసం అని అడుగుతున్నాను. ఈ పరిహారాలు విషయంలో పూర్తి స్థాయి చర్చలైతే జరగడం లేదు..ఇకనైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి ఇలాంటి ఘటనలపై నోరు విప్పాలని డిమాండ్ చేస్తున్నాను.
వేసవి వస్తే చాలు అడవిలో కార్చిచ్చు రగులుతుంది. వాహనదారులు, పాదచారులు వాడి పడేసే బీడీ, సిగరెట్, అగ్గి పుల్లలు కొన్నిసార్లు నిప్పు రాజుకోవడానికి కారణం అవుతుంది. ఈ దావానలం అడవిలోని జంతువులతో పాటు మానవాళి మనుగడకు కూడా ముప్పు తెచ్చి పెడుతుంది. . ఒక మొక్క చెట్టుగా మారాలంటే కొన్నేళ్లు పడుతుంది. అదే వేసవిలో కార్చిచ్చు రగిలితే నిమిషాల్లో వందల వృ క్షాలు తగలబడిపోతాయి. తమిళనాడు, కర్ణాటక సరిహద్దులోని అటవీ ప్రాంతంలోని చెట్లు ఎండిపోవడంతో జంతువులు సరిహద్దులు దాటి ఊర్ల మీద పడి పంటలను నాశనం చేస్తున్నాయి. చిన్న నిప్పు రవ్వ రేగినా అడవి మొత్తం భగ్గున మండిపోతుంది. ఇటీవలి కాలంలో 20 ప్రాంతాల్లో 10 హెక్టార్ల మేర అటవీ ప్రాంతమంతా నాశనమయ్యింది. ప్రభుత్వం పచ్చదనం కోసం కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నాం అని చెప్తోంది కానీ పచ్చని చెట్లను నరికేసి వాటిని ఇటుక బట్టీలకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్న అక్రమార్కుల మీద ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ఇంత జరుగుతున్నా అటవీ శాఖ, రెవెన్యూ శాఖ అధికారులు మాత్రం చూసి చూడనట్టు వ్యవహరించడం సిగ్గు పడాల్సిన విషయం. అడవుల్ని కాపాడతాం, పచ్చదనాన్ని పెంపొందిస్తాం అంటూ ఇచ్చిన హామీ ఎక్కడికి పోయింది. మార్చి మొదలుకుని జూన్ వరకు అటవీ శాఖ అధికారులు ప్రజలకు అవగాహనా కల్పించాల్సిన అవసరం ఉంది. కానీ ఎంత వరకు ఇది అమలౌతోంది. అసలు ఈ విషయం పై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఏమిటి…అటవీ ప్రాంతంలో నివసించే వారి కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలి. ఎక్కడైనా ప్రమాదాలు జరితే క్యూఆర్టీ బృందాలు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలి. దీనికి ప్రభుత్వం పకడ్బందీ చర్యలు చేపడితేనే అడవులకు, జంతుజాలానికి, మనిషి మనుగడకు మేలు జరుగుతుంది.