ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీనే ప్రత్యామ్నాయ పార్టీ అని రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు తెలిపారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గానికి జరగనున్న ఉప ఎన్నికలో జనసేనతో కలిసి బీజేపీ పోటీ చేస్తుందని ఆయన ప్రకటించారు. గురువారం మీడియాతో మాట్లాడిన సందర్భంగా… బీజేపీతో పొత్తు కోసం ఆంధ్రప్రదేశ్ లో ప్రధాన పార్టీలు ప్రయత్నిస్తున్నాయని తెలిపారు. అయితే కుటుంబ పార్టీలకు తాము వ్యతిరేకమన్న ఆయన… ఏపీలో వైసీపీ, టీడీపీలతో బీజేపీకి పొత్తు ఉండదని స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా బీజేపీతో సంబంధాల కోసం వైసీపీ, టీడీపీ చేస్తున్న యత్నాలపై జీవీఎల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో తమకు సత్సంబంధాలున్నాయని వైసీపీ నేతలు ప్రచారం చేసుకుంటున్నారని ఆయన మండిపడ్డారు. రాజ్యాంగ బాధ్యతల్లో భాగంగానే వైసీపీ నేతలతో ప్రధాని కలుస్తున్నారని జీవీఎల్ తెలిపారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు కూడా బీజేపీతో పొత్తు అంటూ డ్రామాలాడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.