ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలో వైసిసి నేతలకు ప్రజల నుంచి వినూత్న రీతిలో నిరసన సెగలు తగులుతున్నాయి. నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం చిన్నమాచనూరులో ఆత్మకూరు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జి మేకపాటి విక్రమ్ రెడ్డి ఈ రోజు పర్యటించారు. దీంతో ప్రజలు రకరకాల సమస్యలను లేవనెత్తారు. మేకపాటి కుటుంబం 30 ఏళ్ల నుంచి అధికారంలో ఉన్నా ఏ ఉపయోగం లేకుండా పోయిందనీ…కనీసం గ్రామానికి ఒక్క సిమెంట్ రోడ్డు కూడా వేయలేకపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.. వర్షం వస్తే బురదలో నడవాల్సి వస్తోందని.. తమ సమస్యలను వివరించారు.
దీనికి విక్రమ్ రెడ్డి ఇచ్చిన జవాబు విని అక్కడి ప్రజలు కంగుతిన్నారు.రోడ్డు అవసరం లేదు.. కనీసం కంకర వేసినా సరిపోతుందని సమాధానం చెప్పారు ఆయన. ఈ సారి ఓట్లు వేస్తే.. కచ్చితంగా రోడ్లు వేయిస్తామని చెప్పారు. ఈసారీ అంటున్నారు…మరీ అప్పుడు కూడా ఇలానే సమాధానం చెప్పరని ఏంటీ అంటూ నిలదీశారు అక్కడి ప్రజలు. ఎన్నికల్లో గెలిచేదాకా ఒక మాట…గెలిచిన తర్వాత అసలు పలకరించరని ఎద్దేవా చేశారు.
ఇది ఇలా వుంటే……మరోవైపు పలువురు మహిళలు తమ ఇంటికి రావొద్దని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నో సమస్యలున్నా కనీసం పట్టించుకోవట్లేదని.. ఓట్లకు మాత్రం పరిగెత్తుకు వస్తున్నారని మండిపడ్డారు. అలాంటి సర్పంచ్ తమకు వద్దని.. ఈ సారి ఒక్క ఓటు వేయమని కచ్చితంగా చెప్పేశారు.
‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమం ఏమోగానీ….తాము వేసే ప్రతి అడుగులో కూడా ఇన్ని మడుగులా అంటూ తలలు పట్టుకుంటున్నారు.
ఈ కార్యక్రమం సంగతి ఇలా వుంటే…ఈ నెల 26 నుండి ప్రారంభమయ్యే బస్సుయాత్రల సంగతేంటో ఓసారి ఆలోచించుకోవాల్సిందే మన మంత్రులు.ఎందుకంటే ప్రజలు కూడా అంతే సిద్దంగా వున్నారు అధికారులను నిలదేసేందుకు.