జగన్ సర్కార్ నెమ్మది నెమ్మదిగా నవరత్నాల పేరుతో పాత పధకాలను అటకెక్కించి కొత్త పధకాలను ప్రజలకు రుచి చూపించి వాటిని కూడా అటకెక్కించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఇప్పటికే అమ్మ ఒడిలో మెలిక పెట్టింది. రేషన్ బియ్యానికి నగదు బదిలీ అంటూ పూర్తిగా నిలిపివేయడానికి పన్నాగాలు పన్నుతోంది. మైనారిటీలను నెత్తిమీద పెట్టుకుని చూసుకుంటానని చెప్పి ఆ పధకాలను కూడా పక్కన పెట్టేసింది. ఇక ఇప్పుడు దివ్యాంగల సంక్షేమానికి కూడా తెర దించేందుకు పావులు కదుపుతోంది.
రాష్ట్రంలో సుమారు 12 లక్షల మంది దివ్యాంగులు ఉన్నారు. వీరి అభివృద్ధి కోసం గత ప్రభుత్వం ఎంతో ఆలోచించి ఎన్నో కార్యక్రమాలు రూపొందించి అమలుచేసింది. అందులో ముఖ్యమైనది మూడు చక్రాల యాక్టీవా బళ్లను వాళ్లకు పంపిణి చేసింది. ఈ ప్రభుత్వం ఆ పధకానికి స్వస్తి చెప్పింది. దాని స్థానంలో త్రిచక్ర సైకిల్ వాహనాలు పంపిణీ చేయాలనీ చూస్తోంది. బధిరులు, చెవిటి, మూగవారికి ఉపకరణాల పంపిణీ ఊసే లేదు. వయోవృద్ధులకు కల్పించాల్సిన ఉపకరణాలు, కనీసం సౌకర్యాలూ కూడా కరువయ్యాయి. అలాగే పోయినేడాది వలంటీర్ల పోస్టుల కోసం మెగా నోటిఫికేషన్ ఇచ్చింది. అందులో దివ్యాంగులకు మొండిచేయి చూపించింది. వారికి అందాల్సిన నాలుగు శాతం రిజర్వేషన్‌ను ప్రస్తుత ప్రభుత్వం అమలు చేయలేదు. అధికారంలోకి వచ్చి ఇన్నేళ్లయినా జగన్ సర్కార్ మాత్రం బ్యాక్‌లాగ్ పోస్టుల్లో తమను నియమించడంలేదని వాపోతున్నారు.
దివ్యాంగుల పెళ్లికానుకగా రూ.1 లక్ష గత ప్రభుత్వం అందించింది. జగన్ సర్కార్ దాన్ని రూ.1.50 లక్షలకు పెంచుతూ ఉత్తర్వులు జారీచేసింది. కానీ బడ్జెట్‌లో నిధులు కేటాయించలేదు.. పథకం అమలుకు ఫుల్ స్టాప్ పడింది. మిగతా కులాలకు అందుతున్న కానుకలనూ కూడా ఆపేశారు. చిరు వ్యాపారం చేసుకునే దివ్యాంగులకు సాయంగా ఒక్కోక్కరికి రూ.1 లక్ష సబ్సిడీ రూపంలో అప్పటి ప్రభుత్వం అందించడమే కాకుండా బ్యాంకుల ద్వారా రుణ సౌకర్యాన్ని కూడా కల్పించింది. కానీ ఇప్పుడు వాటి పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. ఏపీపీఎస్సీ, యూనివర్సిటీలు, ఆర్టీసీ, విద్యుత్‌బోర్డు, టీటీడీల్లో ఉద్యోగావకాశాలు కల్పించాలని, ఉద్యోగులకు అర్హతా పరీక్షల మార్కుల విషయంలో ఎలాగైతే ఎస్సీ, ఎస్టీలకు వెసులుబాటు ఇస్తున్నారో తమకు కూడా అలాగే ఇవ్వాలని హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను అమలుచేయాలని కోరుతున్నారు. ఇళ్లు, స్థలాల కేటాయింపుల్లోనూ కూడా తమకున్న 4 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని కోరుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న దివ్యాంగుల హాస్టళ్లలో సౌకర్యాలు మెరుగుపరచాలని అరకొర బడ్జెట్ కేటాయింపులు చేస్తూ.. ఏదో మొక్కుబడిగా కాకుండా పూర్తిస్థాయిలో నడుపుతూ తమకు అండగా నిలవాలని కోరుతున్నారు.