తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి దివంగత డాక్టర్ నందమూరి తారక రామారావు శత జయంతి వేడుకలను రేపు ఆయన స్వగ్రామమైన కృష్ణా జిల్లా పామర్రు మండలం నిమ్మకూరులో ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ‘శక పురుషుని శత జయంతి’ పేరిట వివిధ దేశాల్లో ఏడాదిపాటు కొనసాగే ఈ ఉత్సవాల్లో భాగంగా నిమ్మకూరుకు ఎన్టీఆర్ తనయుడు నందమూరి బాలకృష్ణ రానున్నారు. ఆయన ఎన్టీఆర్, బసవతారకం కాంస్య విగ్రహాలవద్ద నివాళులర్పించి వేడుకలు ప్రారంభిస్తారు. ఇందుకోసం శుక్రవారం సాయంత్రం బాలకృష్ణ నిమ్మకూరుకు చేరుకుంటారు.
ఎన్టీఆర్ శత జయంత్యుత్సవాల సందర్భంగా పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు టీడీ జనార్దన్ ఆధ్వర్యంలో రూపొందించిన ‘మహాపురుషుడి మైలురాళ్లు’ వీడియో చిత్రాన్ని పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆవిష్కరించారు. ఎన్టీఆర్ జీవితంలోని ముఖ్యఘట్టాలకు సంబంధించిన అరుదైన చిత్రాల్ని ఏడు నిమిషాల నిడివి వీడియోలో పొందుపరిచారు.
ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలను చరిత్రలో నిలిచిపోయేలా నిర్వహిస్తామని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ చెప్పారు. తెనాలి తెదేపా కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. ఎన్టీఆర్‌ను నేటి తరానికి మరోమారు చూపించాలన్నది తమ ప్రయత్నమన్నారు. సినీ మాటల రచయిత బుర్రా సాయిమాధవ్ మాట్లాడుతూ.. తెనాలిలో 28 నుంచి నిరంతరంగా ఏడాదిపాటు శత జయంతి ఉత్సవాలు జరుగుతాయని తెలిపారు. కార్యక్రమాల్లో భాగంగా దివంగత ఎన్టీఆర్ నిర్మింపజేసిన పెమ్మసాని థియేటర్ లో ఆయన చిత్రాల ఉచిత ప్రదర్శన ఉంటుందని తెలిపారు.