తెలంగాణలో జనసేన పార్టీ జెండా ఎగరాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. పవన్ కల్యాణ్ ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో కచ్చితంగా పోటీ చేస్తామన్నారు. గ్రేటర్ హైదరాబాద్ అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని ప్రకటించారు. పోలీసు ఉద్యోగాల వయోపరిమితి సడలింపుపై నిలదీస్తామన్నారు. యువత బలమే జనసేనకు ప్రధాన ఆయుధమని పవన్ ప్రసంగంలోని విషయాలను వివరిస్తూ పవన్ కల్యాణ్ ప్రకటన విడుదల చేశారు.
కొంగరి సైదులు భార్యకు రూ. 5 లక్షల బీమా చెక్కు అందజేత
తెలంగాణలోని ఉమ్మడి నల్గొండ జిల్లా గోపరాజుపల్లికి చెందిన జనసేన పార్టీ క్రియాశీలక సభ్యుడు కొంగరి సైదులు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఉమ్మడి నల్గొండ జిల్లా పర్యటనలో భాగంగా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ సైదులు కుటుంబసభ్యులను పరామర్శించారు. అతని భార్య సుమతిని ఓదార్చారు. సైదులు కుమారుడు కూడా ప్రమాదంలో గాయపడిన విషయం తెలుసుకుని ఆ చిన్నారి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. పార్టీలో క్రియాశీలకంగా పనిచేసిన సైదులు కుటుంబానికి అన్ని విధాలా జనసేన పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. బిడ్డల చదువు, ఆరోగ్యం బాధ్యతను కూడా జనసేన పార్టీ తీసుకుంటుందని హామీ ఇచ్చారు. జనసేన పార్టీ క్రియాశీలక సభ్యులకు ఇచ్చే రూ.5 లక్షల ప్రమాద బీమా చెక్కును కొంగరి సుమతికి అందచేశారు.