సంస్కరణలు, సామాజిక చైతన్యం ద్వారా కాకుండా చట్టాలను మార్చడం వలన సమాజ పురోగతి సాధిస్తామనే రాజకీయ ధోరణి ప్రజాస్వామ్యానికి అత్యంత ప్రమాదకరం. ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం జరుగుతున్న అనైతిక ఉదారవాద విధానాలు, ప్రభుత్వరంగంలో ప్రైవేట్ వ్యక్తుల పెత్తనం, అదేవిధంగా 31 నేర చరిత్ర కలిగిన కేసుల్లో ముద్దాయిగా ఉన్న సీఎం సారథ్యంలో నడుస్తున్న రాష్ట్ర ఆర్థిక విధానాలు సంక్షేమ పథకాల అమలుతీరు భవిష్యత్తరాలకు పెనుశాపంగా మారతాయనడంలో ఎలాంటి సందేహం లేదు..
ఉచిత పథకాలతో సామాజిక ప్రగతి సాధ్యమా ?
బ్రిటీష్ వలసవాద పాలనలో విభజించు, పాలించు అనే నినాదంతో భారతీయ సమగ్రతకు ముప్పుపెట్టిన పరాయి పాలకులను ఈ దేశం అంత తొందరగా మర్చిపోదు.. కానీ మళ్ళీ అదే చరిత్ర పునరావృతం అవుతోంది. దీని కారణంగా ఆయా రాష్ట్రాల భవిష్యత్తు మళ్ళీ అంధకారంలోకి వెళ్ళిపోతోంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో బీసీ కులాలను, మైనారిటీ వర్గాలను అదేవిధంగా షెడ్యూల్ కులాలను, తెగలను విడదీసి వారివారి ఆర్థిక అవసరాలను తీర్చుకునే విధంగా పని కల్పించకపోగా ఉచిత పథకాల మాయలో ప్రజలను ఉంచేసి వారి ఆర్థిక ఎదుగుదల ప్రభత్వ దయాదాక్షిణ్యాల మీద ఆధారపడే విధంగా చేయడం ఒక పెద్ద రాజకీయ కుట్రకు తెరలేపడం తప్ప మరొకటి కాదు.
డబ్బు-పన్నులు- సంక్షేమ పథకాలు
డబ్బు సృష్టి ఎలా జరుగుతుందో ఒక్కసారి పరిశీలిస్తే కారల్ మార్క్స్ సిద్ధాంతం ప్రకారం డబ్బు మానవుని శ్రమ ద్వారా సృష్టించబడుతుంది. సహజ ప్రకృతి వనరులను మనిషి ఉపయోగంలోకి తెచ్చి శ్రమ దానికి అదనంగా చేరడం వలన వస్తువు మార్కెట్ లోకి వచ్చి మారక విలువగా మారి డబ్బు సృష్టించబడుతుందని వివరించడం జరిగింది. ఆ విధంగా సృష్టించబడిన డబ్బు ఒక్కరి చేతుల్లోనే పోగుబడితే అది సమాజంలోని అశాంతికి కారణమౌతుంది. పేద వర్గాల వారు దోపిడీకి గురయ్యామనే భావనతో ధనికులపై తిరుగుబాటు లేవనెత్తితే సమాజంలో అశాంతి చెలరేగుతుంది. కాబట్టి ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వాలు మధ్యేమార్గంగా ఒక పరిధి దాటి సంపాదన ఉన్నవారిపై పన్నులు విధించి ఆ డబ్బుని పేదలకు సంక్షేమ పథకాల రూపంలో ఇచ్చి వారిలో నిరాశను తొలగించే దిశగా ప్రభుత్వం ఆలోచించాలి. అలాగే వారికి సంక్షేమ పథకాలు స్థాయి నుండి వారి ఆర్థిక పురోగతికి మార్గం వేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించాలి. కానీ నేడు ఆ స్ఫూర్తిని వదిలి కేవలం ఓటు బ్యాంకును నిలబెట్టుకోవడం కోసం కేవలం డబ్బుని ప్రచార సరుకుగా మార్చేస్తున్నారు. ప్రజలను వర్గాలుగా విడగొట్టి వారికీ డబ్బును ఇచ్చేసి ప్రభుత్వంపై దీర్ఘకాలికంగా ఆధార పడే వారిగా మార్చాలనేది రాజకీయ కుట్రలో ఒక భాగం అని చెప్పొచ్చు. సంక్షేమ పథకాలు కచ్చితంగా ఉండాల్సిందే కానీ అది ఆయా వర్గాల ఎదుగుదలకు బాసటగా నిలవాలి తప్ప కొన్ని వర్గాల వారు ఎప్పటికి రాజ్యాధికారం చేజిక్కించుకోకూడదు అనే కపట సూత్రంతో వారిని మభ్యపెట్టడం ముమ్మాటీకి పెద్ద తప్పు. సరిగ్గా ఆంధ్రప్రదేశ్ లో నేడు అదే జరుగుతోంది.
బీసీ సంక్షేమ పథకాలు – వట్టి మాటలు
రాష్ట్రంలో 56 వెనుకబడిన తరగతుల కార్పొరేషన్స్ ని సృష్టించిన ప్రభుత్వం ఆచరణలో మాత్రం నిధుల కేటాయింపులో ఊదరగొట్టే మాటలు చెప్తూ ప్రత్యక్ష లబ్దిదారులకు మాత్రం మొండిచెయ్యి చూపిస్తుంది. ఉదాహరణకు వైస్సార్ నేతన్న హస్తం పథకాన్ని ఒక్కసారి పరిశీలిస్తే చేనేత వృత్తిదారులకు ప్రభుత్వం ఎంతగా మోసం చేస్తుందో అర్ధమవుతుంది చేనేత మగ్గం ఉన్న ప్రతి కుటుంబానికి సంవత్సరానికి 24 వేలు ఇస్తున్నట్టు ప్రకటించి 81 వేలకు పైగా లబ్దిదారులకు చేయూతనిచ్చామని ప్రభుత్వం చెప్తోంది. ఇప్పటివరకు 576 కోట్లకి పైబడి సాయం అందించామని వచ్చే ఆర్థిక సంవత్సరానికి 199 కోట్లు పైబడి కేటాయింపులు జరిగాయని గొప్పలు చెబుతున్న అదంతా అబద్ధమని వాస్తవంలో తేలుతున్నాయి. కొన్ని చేనేత సంఘాలు అదంతా అబద్ధమని తేల్చేస్తున్నాయి. మొత్తంగ్గా జగన్ రెడ్డి మూడేళ్ళ పాలన ప్రజలకు పెనుశాపంగా మారిందనడంలో ఎటువంటి సందేహం లేదు. ప్రభుత్వ పాలనలో ప్రైవేట్ సైన్యాలను దించడం, అది రానురాను పొలిటికల్ గ్రాఫ్టింగ్ గా మారి భవిష్యత్తులో సామజిక సంక్షోభం, రాజకీయ సంక్షోభానికి దారి తీస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు కాబట్టి ప్రజలు వాస్తవాన్ని గ్రహించి పక్షపాత చట్టాల ద్వారా వచ్చే పాలన మాకొద్దు అని చెప్పాలి. అదేవిధంగా సామాజిక అభ్యున్నతి ద్వారా మాకు రాజ్యాధికారం కావాలని తెగేసి చెప్పాలి.






								
				
				
			