– వైభవాన్ని కోల్పోయిన చేనేత
– కొనుగోళ్లు జరగక కార్మికుల అవస్థలు
– పెరిగిన నూలు ధరలు
– చేనేత వస్త్రాలు, ఉత్పత్తులపై జీఎస్టీ
– వలస పోతున్న నేతన్నలు
– చేనేత పరిశ్రమకు కోలుకోలేని దెబ్బ
– రోజంతా కష్టపడినా ఫలితం సూన్యం
అచ్చ తెలుగు అందానికి మరింత వన్నె తెచ్చేవి చేనేత వస్త్రాలు అంటే అతిశయోక్తి కాదు. రెండు వేల ఏళ్ల క్రితం `హంస‘ డిజైన్లతో ఉన్న భారతీయ వస్త్రాలు ఈజిప్టులోని కైరో నగరంలో దొరికాయి అంటే మన భారతీయ చేనేత చరిత్ర ఎంత గొప్పదో అర్ధం చేసుకోవచ్చు . అగ్గిపెట్టెలో పట్టే మస్లిన్ చీరలను నేసిన ఘన చరిత్ర ఉన్న దేశం మనది. అంతర్జాతీయంగా కూడా చేనేత వస్త్రాలకు ఎంతో పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి. వారంలో బుధవారమైన చేనేత ధరించండని ఆనాడు వైఎస్.రాజశేఖర రెడ్డి గారు అన్నారు. కానీ ఆ మాటలకు ఇప్పుడు కాలం చెల్లింది. ప్రస్తుతం చేనేత రంగం, చేనేత కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు.
దేశంలో వ్యవసాయ రంగం తర్వాత అతి పెద్ద పరిశ్రమ ఏదైనా ఉందీ అంటే అది చేనేత పరిశ్రమ మాత్రమే. అలాంటి పరిశ్రమను, కార్మికులను ఆదుకోవాల్సిన రాష్ట్ర ప్రభుత్వం మాత్రం వారి సంక్షేమాన్ని గాలికొదిలేసింది. ఎన్నికలకు ముందు చేనేత కార్మికులకు ఇచ్చిన హామీలను మర్చిపోయింది. ఈ మూడేళ్లలో చేనేత కార్మికులను ఆదుకోలేదు సరికదా టెక్స్టైల్ పార్కును సైతం ఇతర ప్రాంతాలకు తరలించేసింది. ఈ ప్రభుత్వం నేతన్నల అభివృద్ధిని , అభ్యున్నతిని ప్రశ్నర్ధకంగా మార్చేసింది. చేనేతలకు అప్పటికే ఉన్న పథకాలను రద్దు చేసి వారి జీవితాలను చీకటిలోకి నెట్టేసి చోద్యం చూస్తోంది. ప్రచార ఆర్భాటమే తప్ప.. ప్రజల్ని కాపాడే పనులు ఈ ప్రభుత్వం ఏమాత్రం చేయడం లేదు. గత ప్రభుత్వం చేనేతలకు సబ్సిడీలను, రుణాలను, వడ్డీ రాయితీలను అందించింది. సొంత మగ్గం లేకపోయినా సరే ప్రభుత్వం వైపు నుంచి ఒక్కో చేనేత కార్మికుడికి ఏడాదికి లక్ష రూపాయల సాయం అందించింది. కరోనా సమయంలో చేనేత కార్మికులు నేసిన వస్త్రాలు కొనుగోళ్లు జరగక కార్మికులు అవస్థలు పడుతున్నా.. ప్రస్తుత ప్రభుత్వం ముందుకొచ్చి వాటిని కొనుగోలు చేసి నేతన్నలను ఆదుకోవాలనే ఆలోచన చేయకపోవడం నిజంగా హాస్యాస్పదం. ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన చేనేత పరిశ్రమ ఇప్పుడు దాని వైభవాన్ని కోల్పోయింది.
‘చేనేతల కష్టాలను నా 3648 కిలో మీటర్ల సుధీర్ఘ పాదయాత్రలో కళ్లారా చూశా. వారి బాధలు విన్నా. మన ప్రభుత్వం రాగానే వైఎస్సార్ నేతన్న నేస్తం పథకం ద్వారా అర్హులకు అంటే మగ్గాలు ఉన్న వారికి ఏటా రూ.24వేలు ఇస్తూ వారికి అండగా ఉంటాం” అని హామీ ఇచ్చారు. మగ్గాలు ఉన్నవారికి ఇస్తారు మరి మగ్గాలు లేని కుటుంబాల వారి పరిస్థితి ఏమిటి..నేతన్నలను ఆదుకుంటామని ఉత్తర కుమారా ప్రగల్బాలు పలికిన నాయకులంతా ఇప్పుడేం సమాధానం చెప్తారు అని అడుగుతున్నా..
గత ప్రభుత్వ హయాంలో హ్యాండ్లూమ్ కార్డు ఉన్న ప్రతి చేనేత కార్మికుడికి చేనేత పెన్షన్ ఇచ్చింది. కానీ ప్రస్తుత ప్రభుత్వం సిక్స్ స్టెప్ వ్యాల్యూషన్ సర్వే అనే పేరుతో కొర్రీలు పెట్టి పెన్షన్లను తొలగించాలని చూడడం చేనేతలను మోసం చేయడం కాదా ముఖ్యమంత్రి గారు అని ప్రశ్నిస్తున్నా. చేనేత వస్త్రాలు తయారీకి తగినంత ముడిసరుకు దొరకడం లేదు. సరైన మార్కెట్ సదుపాయం లేదు.. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడంలో చేనేతలు వెనకబడుతున్నారు.మిల్లుల నుంచి వస్తున్న పోటీని తట్టుకోలేక కుదేలవుతున్నారు.
మార్చి 2020 నుంచి 2022 జనవరి మధ్యన పత్తి, పట్టు నూలు ధరలు 69 శాతం పెరిగాయి. ఈ చేనేత రంగంలో 72 శాతం మంది మహిళులు ఉన్నారు. చేనేత వస్త్రాలకు డిమాండ్ అనేది లేకపోవడంతో ఈ రెండేళ్లలో అమ్మకాలు సరిగా లేకపోవడంతో భారీగా నిల్వలు పేరుకుపోయాయి. ఆ ప్రభావం చేనేత కార్మికులపై పడింది. పెరిగిపోయిన నూలు ధరలు, రంగులు, రసాయన ధరలు చేనేత పరిశ్రమను కోలుకోలేని దెబ్బ తీశాయి. తినడానికి తిండి లేక కుటుంబాలను పోషించుకోవడానికి రకరకాల పంటలు పండించుకుంటున్నారు. పండించిన పంటలకు గిట్టుబాటు ధర రాక, వాటిని నిల్వ చేసుకోవడానికి సరైన కోల్డ్ స్టోరేజీలు లేక చాలామంది ఉన్న ఊరిని వదిలేసి వలసలు వెళ్లిపోవడం బాధాకర విషయం.
ప్రతీ ఏటా నూలు ధరలు పెరుగుతూనే ఉన్నాయి..గత రెండేళ్ల కాలంలో చూసుకుంటే 40 నుంచి 50 శాతానికి పెరిగిపోయాయి. గతంలో 4 .54 కేజీల మేలు రకం నూలు 1200 ధర పలకగా ఇప్పుడు 1950 కి అమ్ముతున్నారు. దీనికి జీఎస్టీ కూడా ఉండడంతో కుటుంబం మొత్తం కష్టపడినా రోజుకు 200 కి మించి ఆదాయం రావడం లేదు. చేనేత వస్త్రాలు , ఉత్పత్తులపై 12 శాతం జీఎస్టీ ఉండడం వలన కార్మికులు పనులు చేయడం మానేశారు. పనులు లేని కారణంగా చేనేత కుటుంబాలు హైదరాబాద్, బెంగళూర్, చెన్నై, కలకత్తా వలస వెళ్లిపోతున్నారు. చేనేత పరిశ్రమను అభివృద్ధి చేసేందుకు గాను అన్ని బ్యాంకులు ముద్ర రుణాలు ఇవ్వాలి. ప్రభుత్వం చేనేత ఉత్పత్తులు కొనుగోలు చేసి వారి జీవితాలకు భరోసా ఇవ్వాలి. చేనేతను మళ్ళీ దాని ప్రభావం, వైభవం తిరిగి తీసుకురావాల్సిన బాధ్యత ప్రస్తుత ప్రభుత్వం పై ఉంది. ఆ దిశగా ముఖ్యమంత్రి గారు గట్టిగా కృషి చేయాలనీ నేతన్నల జీవితాల్లో వెలుగులు నింపాలి.