ఆంధ్రప్రదేశ్ లోని గ్రామాల్లో వైకాపా నాయకులను ప్రజలు అసహ్యించుకుంటున్నారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె.అచ్చెన్నాయుడు అన్నారు. ఒంగోలులో ఆయన బుధవారం మీడియాతో మాట్లాడారు. గడప గడపకు ప్రభుత్వం అనే కార్యక్రమం ద్వారా ప్రజలకుఏ ఉపయోగం లేదని…అసలు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేసింది? అని ప్రజలు వైకాపా నేతలను నిలదీస్తున్నారని ఆక్షేపించారు. వారికి నాయకులు సరైన సమాధానం చెప్పలేకపోతున్నారని విమర్శించారు. మహానాడు వేదిక ఏర్పాటు చేసుకుంటే తిరస్కరిస్తారా అని నిలదీశారు. మహానాడులో 17 తీర్మానాలు ప్రవేశపెట్టాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఒంగోలులోని మినీ స్టేడియం ఇచ్చేందుకు ప్రభుత్వం నిరాకరించడంతో మండువవారిపాలెం రెవెన్యూ గ్రామ పరిధిలోని త్రోవగుంట వద్ద ఈ నెల 27, 28 తేదీల్లో మహానాడు ను నిర్వహించనున్నారు.