ఏపీలో మూడేళ్ల పాలనను అధికార పార్టీ ఇంటింటికీ చేరవేసే కార్యక్రమంతో పాటు, పార్టీని తిరుగులేని శక్తిగా తీర్చిదిద్దాలనేది సీఎం జగన్ లక్ష్యంగా గడపగడపకూ వైఎస్ఆర్ కార్యక్రమం ప్రారంభించారు… కార్యక్రమాన్ని ప్రణాళికా బద్ధంగా నిర్వహించి విజయవంతం చేయాలని, ఆ బాధ్యతను ప్రాంతీయ సమన్వయకర్తలు, మంత్రులు, జిల్లా అధ్యక్షులకు సీఎం అప్పగించారు. ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇన్‌చార్జ్‌లను జిల్లా అధ్యక్షులు, మంత్రులు, రీజినల్ కో ఆర్డినేటర్లు సమన్వయం చేయనున్నారు. రోజూ ఈ కార్యక్రమాన్ని సమీక్షించే బాధ్యతను ప్రాంతీయ సమన్వయకర్తలు, కో ఆర్డినేటర్, వైఎస్సార్‌పీపీ నేత వి.విజయసాయిరెడ్డికి సీఎం జగన్ అప్పగించారు.
గడపగడపకూ వైఎస్ఆర్ కార్యక్రమంలో భాగంగా పార్టీ నేతలు ఒక్కో సచివాలయం పరిధిలో రెండు రోజుల పాటు పర్యటించనున్నారు. ఒక్కో నియోజకవర్గం పరిధిలో సుమారు 80 వరకూ సచివాలయాలు ఉంటాయి. దీంతో దాదాపు నెలలో 20 రోజులు గడప గడపకూ వైఎస్సార్ సీపీ కార్యక్రమం సాగనుంది.
పేరేదైనా జగన్ పార్టీ చేపట్టినది గడప గడపకూ వైసీపీ కార్యక్రమమే. గడప గడపకూ వైసీపీ బదులుగా పేరు మార్చి గడప గడపకూ ప్రభుత్వం అన్నంత మాత్రాన కార్యక్రమం రూపు రేఖలు మారిపోవు. నిజానికి గడప గడపకూ ప్రభుత్వం కార్యక్రమం అయితే అందులో వైసీపీ నాయకుల ప్రమేయం ఉండకూడదు. కానీ ఇక్కడ మాత్రం వైసీపీ నేతల వెనుక అధికారులూ ఉంటున్నారు. అయినా ప్రజలు ఎక్కడికక్కడ తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. మూడేళ్ల పాటు ముఖం చాటేసి ఇప్పుడెందుకు వస్తున్నారంటూ వైసీపీ నేతలను నిలదీస్తున్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, చివరకు మంత్రులూ కూడా ప్రజా వ్యతిరేకతను ఈ కార్యక్రమంలో ప్రత్యక్షంగా చవి చూస్తున్నారు. అనంతపురం నుంచి శ్రీకాకుళం వరకూ జగన్ సర్కార్ చేపట్టిన గడప గడపకూ వైసీపీ ప్రభుత్వం కార్యక్రమంలో నిరసనలు భగ్గు మంటున్నాయి. శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు వైసీపీ నేతలకు ఒకేరకమైన చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. ఈ కార్యక్రమం ద్వారా ప్రజలలో వైసీపీ పట్ల, జగన్ సర్కార్ పట్ల ఎంత వ్యతిరేకత గూడు కట్టుకుందో తేటతెల్లమైందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు.
వైసీపీ ప్రభుత్వం ప్రారంభించిన గడప గడపకూ ప్రభుత్వం కార్యక్రమానికి నిరసనల సెగ తప్పడం లేదు. దీనికి ప్రధాన కారణం ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ కార్యక్రమాలు అన్ని గడపలకూ చేరకపోవడమే. ఈ ప్రభుత్వమే కాదు ఏ ప్రభుత్వంలోనూ దాదాపు సగానికి పైగా జనాభాకు సంక్షేమం చేరడం కల్లే. అయితే ఈ సారి వైసీపీ సర్కార్ మాత్రం అర్హులైన వారిని వెతికి మరీ పథకాలు ఇస్తున్నామని చెప్పుకుంటున్న తరుణంలో జనంలో ఆశలు పెరుగుతున్నాయి. దీంతో తమకు పథకాలు అందడం లేదనే కారణమే ఎక్కువగా గడపగడపకూ ప్రభుత్వం కార్యక్రమంలో ఎదురవుతున్న నిరనసల్లో వినిపిస్తోంది. దీంతో ప్రజాప్రతినిధులకు ఈ సెగ తగులుతోంది.
ప్రతిపక్షాల కుట్ర
గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందని, స్పందన చూసి టీడీపీ ఇలాంటి దుష్ప్రచారాలు చేయిస్తోందని వైసీపీ నాయకులు అంటున్నారు. గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమంలో మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలకు నిరసన సెగ తాకుతూనే ఉంది. గడప ముందుకు వచ్చింది సాక్షాత్తు మంత్రి అని కూడా చూడ్డం లేదు. మూడేళ్లలో జరిగిన అభివృద్ధేంటో చెప్పు అంటూ నిలదీస్తున్నారు. జగన్ బటన్ నొక్కడం తప్ప పథకాల డబ్బులు రావడం లేదని జనం మొత్తుకుంటున్నారు. కొత్తగా రేషన్ కార్డులు ఇవ్వడం అన్నదే మరిచిపోయారని, కొత్త పెన్షన్లు ఎప్పుడిస్తారని ప్రశ్నిస్తే వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు పారిపోతున్నారని జనం డైరెక్టుగానే చెబుతున్నారు. ముఖ్యంగా కరెంట్ బిల్లులు, ఆర్టీసీ ఛార్జీలు, చెత్తపన్ను నుంచి ఇంటిపన్ను వరకు పెంచిన పన్నులను ప్రస్తావిస్తున్నారు. రేషన్ కార్డు ఇవ్వలేదని, మనవాళ్లకు అమ్మ ఒడి రాలేదని, 45 ఏళ్లు దాటిన మహిళలకు ఏడాదికి రావాల్సిన 18వేలు కూడా అందడం లేదని చెబుతున్నారు. కాలనీలో తాగునీరు, కాలువలు, వీధి దీపాలు సమస్య ఉన్న పట్టించుకోవడం లేదని ప్రశ్నిస్తున్నారు..