ఈ రోజు మనం మూడు పూటలా అన్నం తింటున్నామంటే దానికి కారణం రైతులు, కౌలు రైతులే. వాళ్లు శ్రమ చేసి పండిస్తేనే మనకు తిండి దొరికేది. కానీ ఈరోజు పరిస్థితి చూస్తే కౌలు రైతులు వీధిన పడుతున్నారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు . గిట్టుబాటు ధరల్లేక, సొంత భూమి లేక.. అర ఎకరం, రెండెకరాల్లో కౌలుకు తీసుకుని అప్పు చేసి మరీ వ్యవసాయం చేసినా పరిస్థితి మాత్రం మారడం లేదు. కౌలు రైతుల్ని రైస్ మిల్లర్లు, దళారులు కలిసి దగా చేస్తున్నారు.
2019 లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం అప్పటికే ఉన్న రుణ అర్హత కార్డుల చట్టాన్ని రద్దు చేసేసి దాని స్థానంలో కొత్తగా పంట సాగుదారు హక్కు చట్టాన్ని తీసుకొచ్చింది. 2011 లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కౌలు రైతుల కోసం రుణ అర్హత కార్డుల చట్టాన్ని తీసుకొచ్చింది. ఆ చట్టం ప్రకారం వారికే రుణాలు ఇవ్వాల్సి ఉంది. ఐతే ఈ విధానం ఎక్కడా కూడా అమలు కాకపోయేసరికి 2015 లో నీతి ఆయోగ్ ఈ చట్టంలో కొన్ని సంస్కరణలు చేసింది. ఇక 2016 లో నీతి ఆయోగ్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం సాగుదారులకే రుణ అర్హత కార్డులు ఇవ్వాలని తేల్చింది. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఆల్రెడీ ఉన్న పాత పథకాన్ని రద్దు చేసేసి దాని స్థానంలో కొత్త పధకాన్ని ప్రవేశ పెట్టింది.
అంతేకాకుండా ఈ పంట సాగుదారు హక్కు చట్టంలోనూ కొన్ని మెలికలు పెట్టింది. భూమి హక్కుదారుడికి, కౌలుదారుడికి మధ్యలో 11 నెలల ఒప్పందం అనేది రాసుకోవాల్సి ఉంటుంది. అలాగే భూమి హక్కుదారుడు రెవిన్యూ ఆఫీసర్స్ ఆధ్వర్యంలో సంతకం చేస్తేనే గుర్తింపు కార్డు ఇస్తారని చెప్పింది. దీనితో కౌలుదారుడి పరిస్థితి అడ కత్తెరలో పోక చెక్కలా మారిపోయింది. కౌలు దారులకు రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు ముందుకు రావడం లేదు. దీంతో వాళ్ళు తమకున్న కొద్ది పాటి సౌకర్యాలతో సాగు చేయలేక , అధిక మొత్తంలో తీసుకున్న డబ్బుకు వడ్డీలు కట్టలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. రాష్ట్రంలో రైతుల కంటే కౌలు రైతులే అధికంగా ఉన్నారు. రాష్ట్రంలో 32 లక్షల మంది కౌలురైతులు ఉన్నారని కౌలు రైతు సంఘం ప్రతినిధులు చెప్తుంటే 16 లక్షల మందే ఉన్నారంటూ ప్రభుత్వం లెక్కలు చెప్తోంది. పోనీ ఇంతమందిలో దాదాపు భూమి ఉన్న రైతులు పావు వంతు కూడా లేరు. అందులో 16 లక్షల మందికి అర్హత కార్డులు ఇచ్చిందా అంటే అదీ లేదు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక కౌలు రైతుల పరిస్థితి మరీ అద్వాన్నంగా తయారయింది.
తాను పాదయాత్ర చేసే సమయంలో కౌలు రైతుల కష్టాలు విన్నానని వారికి అండగా నిలబడతానని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. రైతు భరోసా పేరుతో ప్రతీ రైతుకు 12 ,500 ఇస్తామని ప్రకటించింది. అలా చూసుకుంటే కేంద్రం రైతులకు ఇచ్చే 6000 కూడా జత చేసి 18500 ఇవ్వకుండా 13500 మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకుంది. ఎట్లా చూసుకున్న రాష్ట్రంలో రైతుల పరిస్థితి మరీ దీనావస్థలో ఉండనే చెప్పొచ్చు. ఇప్పటికయినా ప్రభుత్వం కౌలు రైతుల కష్టాలను తెలుసుకోవాలి. వారికి లబ్ది చేకూరేలా చూడాలి. వారికి రుణాలు ఇచ్చేందుకు ఉన్న మార్గాలను అన్వేషించాలి. కౌలు రైతుల పరిస్థితులను ఎత్తి చూపిస్తున్న ప్రతిపక్షాలను తిట్టడమే పనిగా పెట్టుకోకుండా రైతుల పక్షాన ఆలోచించాలి. 2008 లో రిజర్వు బ్యాంకు ఒక ప్రకటన చేసింది. ఎలాంటి తనకా లేకుండా సెల్ఫ్ డిక్లరేషన్ ద్వారా కౌలు రైతులకు 50 వేల వరకు రుణాలు ఇవ్వొచ్చని చెప్పింది. దాన్ని అమలు చేయాల్సిన అవసరం ఇప్పుడు ఎంతకైనా ఉంది..అలాగే రాష్ట్రము లో చనిపోయిన కౌలు దారుల కుటుంబాలకు నష్ట పరిహారం అందించి వారికి చేయూత ఇవ్వాలి. కౌలు రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.






