అవును ! నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములో జరుగుతున్నకౌలురైతుల ఆత్మహత్యలు ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలగానే చెప్పాలి. రాష్ట్రంలో కౌలు రైతుల ఆత్మహత్యలు దేశవ్యాప్తంగా తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తున్న నేపథ్యంలో కౌలు రైతుల సమస్యల గురించి, వారి వ్యథల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
ముందుగా కొంత భూమి గురించి దాని కోసం పేద ప్రజలు పడే పాట్లు గురించి భూమి కోసం జరిగిన పోరాటాలు, దానికనుగుణంగా వచ్చిన చట్టాలను మనం అర్ధం చేసుకోవాలి. వాస్తవానికి కౌలురైతుల ఆత్మ హత్యల సమస్య ఈనాటిది కాదు, స్వాతంత్రం రాక ముందు నుండి ఉంది. ప్రపంచ చరిత్రలో నిలిచిపోయే తెలంగాణ రైతాంగ పోరాటం భూమి కోసం, భుక్తి కోసం, తెలంగాణ విముక్తి కోసం అంటూ దున్నే వాడికే భూమి చెందాలని ఆనాటి రైతాంగ పోరాటాల ఫలితంగా రైతు సమస్యలపై అప్పటి ప్రభత్వాలు కొన్ని చట్టాలు తెచ్చాయి. 1950లో తెలంగాణలో 1956లో ఆంధ్ర ప్రాంతంలో కౌలుదారుల చట్టాన్ని తెచ్చారు. అది మరి జటిలంగా ఉండి అటు భూ-యజమానికి, భూమిని కౌలుకు తీసుకున్న వ్యక్తికీ కూడా తలనొప్పిగా మారిపోయింది. తర్వాత తెలంగాణలో పిటి రిజిస్టర్ అంటే ప్రొటెక్ట్ టెనెంట్ రిజిస్టర్ ను తెచ్చి ప్రభుత్వం నిర్దేశించిన సమయం వరకు ఎవరైతే దీర్ఘకాలికంగా భూమి మీద ఉన్నారో వారికీ 38E సర్టిఫికెట్ మంజూరు చేసి అప్పటివరకు భూమి మీద ఉన్న కౌలుదారులను భూ-యజమానులుగా ప్రభుత్వం గుర్తించేసరికి భూయజమానులు తమ భూమిని కౌలుకు ఇవ్వాలంటేనే భయపడే పరిస్థితి వచ్చేసింది. ఫలితంగా వ్యవసాయోత్పత్తి తగ్గి తీవ్రమైన ఆహార కొరత ఏర్పడింది. అంటే దీన్ని బట్టి మనం అర్ధం చేసుకోవాల్సింది ఏంటి అంటే..సాగులో ఉన్న సగం భూమిలో ఎక్కువ పంటను కౌలు రైతులే పండిస్తున్నారని అర్ధం.
కౌలురైతులంటే ఎవరు ? వారి సమస్యలేంటి ?
భూ-యజమాని వద్ద భూమిని పంట పండించడం కోసం, తన కుటుంబ జీవనోపాధి కోసం కొంత కాలానికి భూమిని సాగు కోసం తీసుకుని పంట పండించే వ్యక్తులను కౌలుదారులు అంటారు. మొత్తంగా రాష్ట్రంలో 40 లక్షల మంది సాగుదారులు ఉంటె అందులో 30 లక్షల మంది సన్న, చిన్నకారు కౌలు రైతులే ఉన్నారు. అందులో 10 లక్షల మందికి కనీసం సొంత ఇల్లు కూడా లేని పరిస్థితి. ఇందులో మెజారిటీ వర్గాలు బీసీ కులాలకు చెందిన వారే కావడంతో వారు ఎక్కువ శాతం దోపిడీకి గురౌతున్నారు. ఐతే సాధారణంగా కౌలుదారులకు, యజమానులు భూమిని కేవలం నోటి మాట ద్వారా మాత్రమే భూమిని కౌలుకివ్వడం జరుగుతుంది. ఎటువంటి హామీ పత్రాలు కానీ అగ్రిమెంట్ పత్రాలు కానీ ఇవ్వరు కారణం తమ భూమి ఆ తరువాత వారి చేయి జారుతుందేమో అని భయం దీనివలన అసలు వారు కౌలుదారులుగా గుర్తింపబడటానికి ఎటువంటి ఆధారము ఉండదు . దీంతో ప్రభత్వం నుండి కౌలుదారులకు వచ్చే పంట ఇన్ పుట్ సబ్సిడీ కానీ ఇన్సూరెన్స్ కానీ లేదా రుణమాఫీ గాని పంట నష్టం గాని ఎటువంటి ప్రభుత్వ సంక్షేమ పథకాలు వాళ్లకు అందవు. దీనితో పంటకు నష్టం వాటిల్లితే బ్యాంకు రుణాలు కానీ లేదా ప్రైవేట్ వ్యక్తుల నుండి తెచ్చిన వడ్డీలు కట్టలేక కౌలు రైతులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఇది చాలా శోచనీయమైన విషయం.
కౌలురైతుల చట్టాలు ఏం చెప్తున్నాయి ?
అంధ్రా ప్రాంతంలో 1956 కౌలు రైతుల చట్టం జటిలంగా ఉన్న నేపథ్యంలో 2011 లో అధీకృత సాగు చట్టాన్ని అమలులోకి తీసుకురావటం జరిగింది. ఈ చట్టం ప్రకారం ఎల్ ఈ సి కార్డును కౌలు రైతులకి ఇచ్చింది. దీనివలన భూయజమానికి ఎటువంటి నష్టం లేకుండా కౌలు రైతుకు భూమి హక్కులు సంక్రమించకుండా ఉభయుల అంగీకారంతో తహసీల్దార్ కౌలురైతులకి కార్డు ఇవ్వటం జరిగింది. దీని వలన కౌలు రైతులు కొంత ఊపిరి పీల్చుకున్నారు. తర్వాత ఆంధ్రప్రదేశ్ లో 2019 లో ఒక చట్టాన్ని తెచ్చారు. దానినే పంట సాగుదారుల హక్కు చట్టం అంటారు.. దీని వలన గతం లో భూయజమాని ఆరేళ్లకు కౌలుకి ఇవ్వాల్సి వచ్చేది. దానిని ప్రభుత్వం 11 నెలలకి కుదించేసరికి భూయజమానులు కొంత ఊపిరి పీల్చుకున్నారు. కౌలు తీసుకున్న రైతులు పంట పండకపొతే మాత్రం తీవ్ర నష్టాన్ని చూడాల్సివస్తోంది. ప్రభుత్వం చెప్పేది ఏంటంటే 11 నెలలు కౌలు అగ్రిమెంట్ ఉన్న రైతుకు పంట హక్కుదారుల కార్డును ప్రభుత్వం ఇచ్చి రైతుని కౌలుదారునిగా గుర్తిస్తుంది. కాబట్టి ఒకవేళ రైతుకి పంట నష్టం వాటిల్లితే ప్రభుత్వం భరిస్తుందని చెప్తున్నారు. వాస్తవానికి అవి ఒట్టి మాటలు తప్ప అందులో నిజం లేదు అన్నది నగ్న సత్యం.
ఆంధ్రప్రదేశ్ లో కౌలు రైతుల దుస్థితి ఏంటి ?
2019 లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్బాటంగా తెచ్చిన చట్టం నిరుపయోగంగా మారింది. అప్పు ఇచ్చే నాధుడు లేక బ్యాంకు రుణాలు లేక ప్రైవేట్ వడ్డీలకి అప్పు తెచ్చి పంట పండక, అప్పు తీర్చలేక చాల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి సంభవించింది. ఏదైనా కష్టం వచ్చి రైతులు ఆత్మహత్య చేసుకుంటే జీవో నెంబర్ 43 ప్రకారం 7 లక్షల రూపాయలు నష్ట పరిహారం ఇస్తామని వైసీపీ ప్రభుత్వం చెప్తున్నా వాస్తవానికి అవి తీసుకున్న నాధుడు లేడు. 2021డిసెంబర్ నాటికీ 2 ,112 మంది ఆత్మహత్యకు పాల్పడితే కేవలం 718 మందికి మాత్రమే సాయం అందిందని లెక్కలు చెప్తున్నాయి. రైతు భరోసా పేరుతో ప్రతి రైతుతో పాటు కౌలు రైతుకి కూడా 13500 రైతు సాయం చేస్తామని చెప్పిన ప్రభుత్వం వాస్తవానికి చేసింది సున్నా.
బడుగు వర్గాల పరిస్థితి ఏమిటి ?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములో బడుగు, బలహీన వర్గాలకు చెందిన రైతులు కౌలురైతుల పరిస్థితి చాలా దారుణంగా వుంది. అసలు ప్రధానంగా భూమి మొదట బ్రాహ్మణ వర్గాల చేతుల్లో ఉండేది. తర్వాత కమ్మ, రెడ్డి లాంటి లాంటి సూద్ర కులాల చేతుల్లోకి భూమి మారుతూ వచ్చింది. దీని వలన వారు సామాజికంగా, ఆర్ధికంగా ఉన్నతంగా ఎదగడమే కాకుండా రాష్ట్ర రాజకీయాలను కూడా శాసించే స్థాయికి ఎదిగారు. కాబట్టి ఈ పరిస్థితి మెరుగవ్వాలంటే బడుగు, బలహీన వర్గాలకు చెందిన రైతులు, కౌలురైతుల సంఘటితంగా ఎదగాల్సిన అవసరం ఉంది. పంట నష్టాలతో ఆత్మహత్యలు చేసుకున్న వారిలో సగంపైగా ఈ వర్గాలకు చెందిన వారే ఎక్కువ. బయట నుంచి తెచ్చిన వడ్డీలు కట్టలేక రైతు భరోసా అందక ప్రభుత్వం చెబుతున్న మాటలకూ, చేతలకు సంబంధం లేకపోవడంతో చాలా మంది ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితి వస్తోంది. ఇప్పటికైనా ప్రభుత్వం భూయజమానితో సంబంధం లేకుండా కౌలురైతుకు గుర్తింపు కార్డు ఇవ్వలని బ్యాంకు రుణాలు ఇన్ పుట్ సబ్సిడీ, పంట నష్టం ఇవ్వాలని బలహీన వర్గాలను మోసం చేయటం ఆపి మంచి పాలన అందించాలని రైతు సంఘాలు కోరుతున్నాయి.