నవరత్నాలు పేరుతో ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఎన్నో పధకాలను ప్రవేశపెడుతున్నామని గొప్పలు చెప్పుకుంటూనే..ఒక్కో పధకాన్ని కూడా అటకెక్కించే పనిలో పడ్డారని సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో 104 సంచార వైద్య సేవలు ఒక్కొక్కటిగా నిలిచిపోతున్నాయి. గత రెండు నెలలుగా సిబ్బందికి జీతాలు అందకపోవడంతో వారు నిరసన బాట పడుతున్నారు. వైద్య సేవలను నిలిపేస్తున్నారు. ఇప్పటికే ఎన్‌టీఆర్ జిల్లాలోని విజయవాడ గ్రామీణ మండలంలో మూడు, నందిగామ మండలంలో రెండు వాహనాల సేవలను వైద్యులు ఆపివేశారు. మిగతా వైద్యులు, సిబ్బంది కూడా తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో సేవలు అందించడంలో కీలకపాత్ర పోషిస్తున్న 104 సిబ్బందిలో చాలా మంది నెల జీతంపైనే ఆధారపడుతున్నారు. ఒక్క నెల జీతం ఆగితేనే కుటుంబం గడవని పరిస్థితి ఉంటోందని వాపోతున్నారు. దీంతో సేవలను ఆపేయడం తప్ప మరో గత్యంతరం లేదంటూ తేల్చి చెబుతున్నారు.
104 వాహనాల్లో పనిచేసే సిబ్బందికి ఇచ్చే జీతాలే అరకొరగా ఉంటున్నాయని సిబ్బంది వాపోతున్నారు. వాటిని కూడా ఆపేయడం వల్ల తమ పరిస్థితి దయనీయంగా మారిపోయిందన్నారు. వాహనంలో పని చేసే డ్రైవర్లకు సీనియారిటీ ఆధారంగా రూ.14వేల నుంచి రూ.25వేల మధ్యలో ఉంటోంది. డేటా ఎంట్రీ ఆపరేటర్లకు రూ.15వేల లోపే జీతాలు ఇస్తున్నారు. వైద్యులకు రూ.50వేల నుంచి రూ.60వేల మధ్యలో జీతాలున్నాయి. గ్రామీణ ప్రాంతంలో సేవలు అందిస్తే వీరికి ప్రభుత్వ ఉద్యోగావకాశాల్లో రెండు పాయింట్లు అదనంగా కలుస్తాయనే ఆశతో పనిచేస్తున్నారు. ప్రస్తుతం ఈ అరకొర జీతాలు కూడా మార్చి, ఏప్రిల్ నెలలో ఇవ్వకపోవడంతో ఒక్కొక్కరుగా సిబ్బంది సేవలను నిలిపేస్తున్నారు.
ఉమ్మడి కృష్ణా జిల్లాలోని 980 గ్రామ పంచాయతీల్లో వైద్య సేవలు అందించడంలో ఈ సంచార వాహనాలదే కీలకపాత్ర. ప్రతి నెలా ఈ వాహనాల ద్వారా కనీసం 60వేల మందికి పైగా రోగులను పరీక్షించి మందులను అందజేస్తుంటారు. ఎక్కడో దూరంగా ఉన్న ప్రభుత్వ వైద్య కేంద్రాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండానే రోగుల దగ్గరికే వెళ్లి 104 వాహనాలు సేవలు అందిస్తుంటాయి.
ప్రతి రోజూ ఈ వాహనాల వద్ద వైద్యులు నిర్వహించే ఓపీకి వ్యాధులతో బాధపడేవాళ్ళు అధికంగా వస్తుంటారు. వాస్తవానికి గ్రామీణ ప్రాంతాల్లో ఉండేవారు.. బీపీ, మధుమేహం లాంటి పరీక్షలను ఎప్పటికప్పుడు ఆస్పత్రులకు వెళ్లి చేయించుకునే పరిస్థితి ఉండదు. దీని వల్ల వ్యాధుల తీవ్రత పెరిగి గుండెపోటు బారినపడుతున్న వారు కూడా పెరుగుతున్నారు. ఇలాంటి కీలకమైన వైద్య సేవలను గ్రామీణ ప్రాంతాల్లో ఆపేస్తుండడంతో అక్కడ ఉండే ప్రజలకు తీవ్ర ఇబ్బందులు తప్పడం లేదు.
ప్రస్తుతం 104 వాహనాలకు అవసరమైన ఇంధనం, మందులను మాత్రం ఒక ప్రెవైటు నిర్వహణ సంస్ధ అందజేస్తోంది. జీతాల గురించి అడిగితే ప్రభుత్వం నుంచి నిధులు ఇంకా విడుదల కాకపోవడం వల్లే ఇవ్వలేకపోతున్నామని సంస్ధ అధికారులు చెబుతున్నారంటూ సిబ్బంది వాపోతున్నారు. దీంతో ఒక్కొక్కరుగా వైద్యులు తీవ్ర అసంతృప్తితో సేవలను నిలిపేస్తున్నారు. కొంత మంది వైద్యులు ఇప్పటికే నీట్ లాంటి పరీక్షల కోసం సెలవుల్లో ఉన్నారు. ఆ ప్రభావంతోనే చాలా వాహనాలకు వైద్యుల కొరత ఉంటోంది. ఈ నేపథ్యంలో జీతాల ప్రభావంతో ఒక్కొక్కరిగా ఆగిపోవడంతో మిగతా వాహనాలూ రోడ్డెక్కడం లేదు.