రాష్ట్రవ్యాప్తంగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న గడపగడపకు ప్రభుత్వం కార్యక్రమంలో వైసీపీ నేతలకు అడుగడుగునా చేదు అనుభవాలు, నిరసనలు ఎదురవుతున్నాయి.
తాజాగా కృష్ణాజిల్లా చల్లపల్లి మండలంలో గడపగడపకు కార్యక్రమంలో ప్రభుత్వ తీరును ప్రైవేటు స్కూల్ నిర్వాహకుడు ప్రశ్నించాడు. కుల,మత,పార్టీ వివక్షతలు చూడమని చెప్పిన జగన్ ప్రభుత్వం…ఇప్పుడు మొత్తం పరిపాలనలో వివక్ష నే చూపిస్తోందంటూ విమర్శించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ వైఫల్యాలను ఉపాధ్యాయుడు బయటపెట్టాడు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ కుమారుడు వికాస్‌ను రేషన్, ధాన్యం డబ్బు, మంచినీటి సమస్యలపై గ్రామస్తులు నిలదీశారు. వ్యవసాయ ఇన్సూర్యన్స్ లేకపోవటంతో 4 గ్రామాల రైతులు తీవ్రంగా నష్టపోయారని సాక్ష్యాలతో సహా నిలదీశారు. రైతు భరోసా కేంద్రాలు సరిగ్గా పనిచెయ్యడం లేదంటూ..మండిపడ్డారు. ప్రభుత్వ నిర్వాకంతో బస్తా ధాన్యాన్ని 690 రూపాయలకు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. రేషన్ షాపుల్లో బియ్యం తప్పించి ఏమీ ఇవ్వటం లేదని మహిళలు ఫిర్యాదు చేశారు.
