నవరత్నాలు పేరుతో ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఎన్నో పధకాలను ప్రవేశపెడుతున్నామని గొప్పలు చెప్పుకుంటూనే..ఒక్కో పధకాన్ని కూడా అటకెక్కించే పనిలో పడ్డారని సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ ఏడాది జూన్‌లో విడుదల చేసే అమ్మఒడికి 13 వేల రూపాయలు మాత్రమే జమ చేయాలనుకోవటంతో ఈ విమర్శలు వినిపిస్తున్నాయి. దీనిపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ కూడా విమర్శలు గుప్పించారు.
అమ్మఒడి కూడా దశల వారీగా అటకెక్కించేస్తారా అంటూ ఆయన ప్రశ్నించారు. ముఖ్యమంత్రి వైయస్.జగన్మోహన్ రెడ్డి అమ్మఒడి పథకంపై కూడా మాట తప్పి, మడమ తిప్పారని ఆరోపించారు. ఈ ఏడాది జూన్‌లో విడుదల చేసే అమ్మఒడికి 13 వేల రూపాయలు మాత్రమే జమ చేయాలనుకోవటం తగదని అన్నారు. 2021-22 ఆర్థిక సంవత్సరంలో అమ్మఒడి అమలు చేయలేదని తెలిపారు. మరుగుదొడ్ల నిర్వహణ పేరుతో ఇప్పటికే 1000 రూపాయల కోత విధించిన ప్రభుత్వం, ఇప్పుడు పాఠశాల మౌలిక సదుపాయాల నిర్వహణకు మరో 1000 రూపాయలను తగ్గించడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు.
పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కోసం నిధులు విడుదల చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే అని స్పష్టం చేశారు. అమ్మఒడి పథకం అమలులో కోతలు విధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పలు మెలికలు పెట్టిందన్నారు. ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి ఉంటే ఎటువంటి కోతలు లేకుండా,అక్షరాల 15 వేల రూపాయలను తల్లులు ఖాతాల్లో జమ చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ డిమాండ్ చేశారు.