రాష్ట్రంలో అమ్ముకోవడానికి ఏమి లేక ఆఖరికి రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్. జగన్ మోహన్ రెడ్డి రాజ్యసభ సీట్లు అమ్ముకున్నారని వైఎస్‌ఆర్ జిల్లా కమలాపురం మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి ఆరోపించారు. జగన్ పాలన తుగ్లక్ కూడా నవ్వుకునేలా ఉందని అన్నారు. కేసుల నుంచి బయట పడేందుకే రాజ్యసభ సీట్లు అమ్ముకున్నారని కమలాపురంలో నిర్వహించిన మీడియాసమావేశంలో ఆరోపించారు.
వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీలో రాజ్యసభకు అర్హులైన నాయకులు లేనందునే పక్క రాష్ట్రం నుండి నిరంజన్ రెడ్డి , ఆర్.కృష్ణయ్య ను ఎంపిక చేశారని అన్నారు. వీరు ఆంధ్రప్రదేశ్ లో ఏ జిల్లాకు చెందిన వారని ఆయన నిలదీశారు. తెలంగాణకు చెందిన వారికి రెండు రాజ్యసభ సీట్లు ధారాదత్తం చేశారని ఆక్షేపించారు . బటన్ నొక్కి నిధులు విడుదల చేస్తున్నామని చెబుతున్న జగన్.. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం కాదు…….ఆ పథకాలు ఇప్పుడు ఏ స్థాయిలో ఉన్నాయో సర్వే చేయించుకోవాలని సూచించారు. 2024 ఎన్నికల్లో జగన్‌కు బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని శివారెడ్డి హెచ్చరించారు.






