కేంద్రమంత్రిగా ఉన్న సమయంలో రైల్వేలో ఉద్యోగాలు ఇప్పించేందుకు కొందరు అభ్యర్థుల నుంచి భూములు తీసుకున్నారన్న అభియోగాలపై రాష్ట్రీయ జనతా దళ్ -ఆర్జేడీ పార్టీ అధినేత, బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్‌పై కేంద్ర దర్యాప్తు సంస్థ-సీబీఐ మరో కొత్త కేసు నమోదు చేసింది.
ఈ కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సీబీఐ ఈరోజు దర్యాప్తు చేపట్టింది. లాలూ, ఆయన భార్య రబ్రీ దేవి, కుమార్తెలు మీసా భారతి, హేమలతో పాటు పలువురు అభ్యర్థులపైనా కేసులు నమోదయ్యాయి. ఇందులో భాగంగా ఈరోజు పలు ప్రాంతాల్లో ఏక కాలంలో సోదాలు జరిపింది. దిల్లీ, పట్నా, గోపాల్‌గంజ్‌లోని నివాసాలతో పాటు పలు కార్యాలయాల్లో ఈ తనిఖీలు జరిగాయి.
2004 నుంచి 2009 వరకు కేంద్రంలో యూపీఏ హయాంలో లాలూ రైల్వే మంత్రిగా ఉన్నారు. 2008-09 మధ్య రైల్వే ఉద్యోగాలకు నియామక ప్రక్రియ జరగ్గా.. అందులో కొన్ని అవకతవకలు చోటుచేసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. కొందరు అభ్యర్థులకు ఉద్యోగాలు ఇచ్చేందుకు వారి నుంచి లాలూ కుటుంబం భూములు, ఇతర ఆస్తులను లంచంగా తీసుకున్నట్లు ఆరోపణలు రావడంతో సీబీఐ కేసు నమోదు చేసింది.
ఈ సోదాలను ఆర్జేడీ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే లాలూపై కేసు పెట్టిందంటూ దుయ్యబడుతున్నారు.