- ఆంధ్రాలో యువతకు ఉద్యోగావకాశాలు లేవు
- యువత అక్రమ మద్యం వ్యాపారం చేస్తున్నారు
- రైతులు కూడా కొన్నిచోట్ల సహకరిస్తున్నారు
బాధ్యత గల ప్రభుత్వాలు రాష్ట్ర పరిధిలోని వనరులకు తగ్గ పరిశ్రమలు ఏర్పాటు చేసి స్థానికంగా ఉండే యువతకు ఉద్ద్యోగ,ఉపాధి అవకాశాలు కల్పించాలి. లేనిపక్షంలో అక్కడి యువత గాడి తప్పి సంఘ విద్రోహ శక్తులుగా మారే అవకాశం ఉంది.
చిత్తూరు జిల్లాలోని చెక్కెర పరిశ్రమ మూత పడడంతో స్థానిక యువత మరియు చెరకు రైతులు అక్రమ మద్యం బట్టీ వ్యాపారం వైపు వెళుతుండడం ఆందోళన కలిగిస్తుంది. వెదురు కుప్పం, కార్వేటి నాగారం, ఎస్.ఆర్.పురం,
జీడి నెల్లూరు,గుడిపాల,చిత్తూరు రూరల్, పుంగనూరు మండలాల్లో 20 నుండి 25 సంవత్సరాల యువత ను అక్రమ మద్యం బట్టీ ముఠాలు ఈ వ్యాపారం వైపు ఆకర్షిస్తున్నాయి,చెరకు రైతులు కూడా ఈ సారావ్యాపారాన్ని ఇంకో ఆదాయ మార్గం గా చూడడం అత్యంత బాధాకరం.
రాష్ట్రవ్యాప్తంగా కూడా ఈ అక్రమ మద్యం ఏరులై పారుతుంది.ఇటీవల జంగారెడ్డి గూడెం లో నకిలీ మద్యం తాగి 20 మంది చనిపోయారు. అవి ప్రభుత్వ హత్యలు అంటూ ప్రతిపక్షాలు ఆందోళనలు చేశాయి. కానీ ప్రభుత్వం మాత్రం అవి సహజ మరణాలు దానికి ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదు అని చెప్పడం మనం చూశాం.
భారతదేశంలో ప్రమాదవశాత్తు మరణాలు మరియు ఆత్మహత్యలపై నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NCRB) నివేదిక ప్రకారం, 2019లో రాష్ట్రంలో 27 మంది (నలుగురు స్త్రీలు సహా) అక్రమ/నకిలీ మద్యం సేవించడం వల్ల మరణించినవి 25 సంఘటనలు జరిగాయి,2020లో రాష్ట్రంలో అక్రమ మద్యం సేవించడం వల్ల 36 మంది మరణించారు.కర్ణాటక రాష్ట్రం తరువాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలో రెండవ స్థానంలో ఉంది. ఇది ప్రభుత్వం గుర్తు పెట్టుకొని దాని ప్రకారం చర్యలు తీసుకోవాలి అని ప్రజలు కోరుకుంటున్నారు.
ఈ అక్రమ మద్యం వ్యాపారంలో పెద్ద మొత్తంలో డబ్బు వస్తూ ఉండడం తో ఫ్రీ మనీ కి అలవాటు పడిన యువత కూడా ఈ మార్గాన్ని ఎంచుకుంటున్నారు. దీని వల్ల వారి బంగారు భవిష్యత్తు పాడు అవుతుంది అని ఆలోచించడం లేదు.గత నెలలో ఒక్క చిత్తూరు లోనే 188 కేసులు, తూర్పు గోదావరి జిల్లాలో 308 కేసులు నమోదు అవ్వడం దీని తీవ్రతను తెలుపుతుంది. గత నెలలోనే Special Enforcement Bureau(SEB) చేసిన దాడుల్లో రాష్ట్రవ్యాప్తంగా 13,471 లీటర్ల అక్రమ మద్యం,68,618 కిలోల నల్ల బెల్లం పట్టుకున్నారు,1,129 కేసుల్లో 677 మందినీ అరెస్ట్ చేయడం జరిగింది వీరిలో ఎక్కువ మంది యువత కావడం బాధాకరం, దీనితో పాటు 47 వాహనాలు సీజ్ చేశారు.
యువత కు ప్రభుత్వం సరియైన ఉద్ధ్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించి వీరు చెడు మార్గాల్లో వెళ్లకుండా కాపాడాలి. అంతేకాకుండా తూతూ మంత్రంగా అప్పుడప్పుడు ఏవో కొన్ని దాడులు చేసి ప్రజల కన్నీళ్లు తుడిచినట్లు కాకుండా పటిష్టమైన కార్యాచరణ రూపొందించి ఈ అక్రమ మద్యం వ్యాపారులను కఠినంగా శిక్షించాలి