విద్యా సంవత్సరం ముగిసిపోయింది. కానీ ఇంకా అమ్మ ఒడి పధకం డబ్బులు మాత్రం ఇంకా అందలేదు. నవరత్నాల్లో భాగంగా అమ్మ ఒడి అని పేరు కొత్తగా పెట్టి ప్రజలను ఆకర్షించింది ప్రస్తుత ప్రభుత్వం.. 2019 – 20 సంవత్సరానికి ఈ పథకాన్ని అమలులోకి తెచ్చారు. ఐతే మొదటి ఏడాది ప్రతి ఒక్కరికి 15 వేలను అర్హలైన తల్లుల ఖాతాలో వేశారు. రెండో ఏడాది అంటే 2021 జనవరిలో 14 వేలను వేసింది ప్రభుత్వం..ఈ ఏడాది మాత్రం ఇంకా వేయలేదు. విద్యా సంవత్సరం ముగిసినా ఖాతాల్లో డబ్బులు పడకపోయేసరికి తల్లితండ్రుల్లో అయోమయం నెలకొంది.
ఈ ఏడాది జనవరి లో అందించాల్సిన అమ్మ ఒడి పథకం నగదును మళ్ళీ విద్యా సంవత్సరం ప్రారంభమయ్యే సమయానికి అంటే జూన్ లో ఖాతాల్లో వేస్తామని చావు కబురు చల్లగా చెప్పింది. ఐతే ఏ పథకంలో ఐనా ప్రజలకు సంక్షేమం పేరుతో అందిస్తున్నామని చెప్తూనే మెలికలు పెడుతూ వారిని ఇబ్బందులు పెట్టడం ప్రజలు కూడా గమనిస్తున్నారు. ఈ అమ్మ ఒడి విషయంలో కూడా అనుకున్నట్టు గానే అయ్యింది. ఇందులో కొత్త రూల్స్ తెచ్చింది. ఆల్రెడీ ఉన్న పాత నిబంధలు కొన్ని కొత్తవి జోడించింది.
పథకం పెట్టిన మొదటి రెండేళ్లు పరిశీలిస్తే గనక విద్యార్థుల హాజరు శాతంతో పని లేకుండా అర్హులైతే చాలు అమ్మ ఖాతాల్లో డబ్బులు వేసేసారు. మూడో ఏడాది వచ్చేసారి మొదట్లో ఉన్న ఉత్సాహం చాలా వరకు నీరు గారిందని చెప్పాలి. ఇప్పుడు 75 శాతం హాజరు ఉండాల్సిందే అని కొత్త రూల్ పెట్టింది. ఐతే విద్యార్థుల హాజరు శాతాన్ని అటెండెన్స్ అప్ లో స్కూల్ యాజమాన్యాలు అప్డేట్ చేయాల్సి ఉంది. కానీ ఆ ప్రక్రియ ఎక్కడ సరిగా జరగలేదు. ఈ ప్రక్రియలేవీ పూర్తి కాకపోవడంతో అసలు అమ్మ ఒడి ఈ ఏడాది వస్తుందా రాదా ? అనే మీమాంసలో ఉన్నారు.
అమ్మ ఒడి పధకానికి డబ్బులు పడాలంటే ఆధార్ తప్పనిసరి చేశారు. ఐతే మీ సేవ కేంద్రాల్లో టెక్నికల్ సమస్యల వలన తల్లి తండ్రులు కేంద్రాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. అలాగే విద్యుత్ వినియోగం 300 యూనిట్లు దాటినా కూడా అమ్మ ఒడి పధకం డబ్బులు రావు. అలాగే జనవరిలో అమ్మ ఒడి డబ్బులు వస్తాయని చాలా విద్యాసంస్థలు ఫీజులు కట్టించుకోలేదు. చివరికి జూన్ కి వాయిదా పడడంతో ఫీజులు కడితేనే పరీక్షలకు రావాలని విద్యార్థులకు అడ్డంకులు గురి చేస్తున్నాయి కొన్ని ప్రైవేట్ యాజమాన్యాలు. విద్యార్థుల హాజరుపై సరైన నిబంధనలు లేవు..అటెండెన్స్ అప్ లో కూడా వాటిని నమోదు చేయలేదు. ప్రభుత్వం ఈ విషయం పై పరిశీలించి వెంటనే అమ్మ ఒడి పధకం డబ్బులు ఖాతాల్లో వేయాలని లేకపోతె ఇబ్బందులకు గురౌతామని తల్లితండ్రులు కోరుతున్నారు..