కోనసీమ సంఘటన దురదృష్టకరమని అందరూ ముక్తకంఠంతో దీన్ని ఖండించాలని తిరుపతి ఎంపీ గురుమూర్తి పేర్కొన్నారు.ఈ సంఘటనను తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ఎందుకు ఖండించడం లేదని ఆయన ప్రశ్నించారు. కుట్ర పూరిత రాజకీయాలు చెయ్యవద్దని ప్రతి పక్షాలకు ఆయన హితవు పలికారు.
తిరుపతి జిల్లా తిరుపతి లో బుధవారం ఆయన విలేఖరుల సమావేశం లో మాట్లాడుతూ……..
అమలాపురంలో జరిగిన సంఘటనలు పూర్తిగా కుట్ర పూరితంగా జరిగాయని తాను భావిస్తున్నానని అన్నారు. రాష్ట్రంలో అలజడులు సృష్టించాలని కుట్రలో భాగంగా ఇలా చేసారని.. రాజకీయంగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ని ఎదుర్కోలేక కులాల మధ్య ఇలాంటి చిచ్చు పెట్టి రాజకీయ పబ్బం గడుపుకుంటున్నారని, ప్రజలు విజ్ఞులని ఇవన్నీ గమనిస్తున్నారని ఈ కుట్రలను తిప్పి కొడతారని తెలిపారు.
డా// బిఆర్.అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా అణగారిన వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా సుపరిపాలన సాగిస్తున్న ముఖ్యమంత్రి పరిపాలన సౌలభ్యంలో భాగంగా జిల్లాల పునర్విభజన చేపట్టడం జరిగిందని చెప్పారు. ఇందులో భాగంగా కొన్ని జిల్లాలకు మహనీయుల పేర్లు పెట్టడం జరిగిందని ఇలా పెట్టేప్పుడు ప్రజల నుంచి, ప్రతి పక్ష పార్టీల నుంచి, సామజిక సేవా సంస్థల నుంచి వచ్చిన విజ్ఞప్తులను కూడా పరిగణలోకి తీసుకొని జిల్లాల పేర్లను ప్రకటించడం జరిగిందని చెప్పారు. అలాగే ఏమైనా అభ్యంతరాలు ఉంటె తెలియజేయమని గడువు కూడా ఇచ్చారని అప్పుడు ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయకుండా నేడు ఇలా చేయడం శోచనీయమన్నారు.
ఈ సంఘటనను తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన పార్టీ కానీ ఎందుకు ఖండించడం లేదని ప్రశ్నించారు. ప్రతిపక్షాలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని తమ స్వార్ధ రాజకీయాల కోసం యువతను పెడతోవ పట్టించవద్దని ఎంపీ గురుమూర్తి కోరారు.