జగన్ సర్కార్ కొత్త జిల్లాలను ఏర్పాటుచేసిన సంగతి తెలిసిందే. ఉగాది నుంచి కొత్త జిల్లాల్లో పాలన ప్రారంభమైంది. ఈ క్రమంలో అమలాపురం కేంద్రంగా కోనసీమ జిల్లాను ఏర్పాటుచేశారు. కోనసీమ జిల్లా పేరు మార్పుపై జరిగిన హింసాకాండ నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా పట్టణాన్ని పూర్తిగా అదుపులోకి తీసుకున్నారు. అమలాపురంలోకి బస్సులు రాకుండా అన్ని మార్గాలూ మూసేశారు. కోనసీమ వ్యాప్తంగా 144 సెక్షన్, సెక్షన్ 30 అమలు చేస్తున్నట్టు పోలీసులు ప్రకటించారు. ఇతర జిల్లాల నుంచి అదనపు బలగాలను రప్పించి పట్టణంలో మొహరించారు. సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి గట్టి నిఘా ఏర్పాటు చేశారు. రావులపాలెంలో నిరసనలు జరుగుతాయనే వార్తల నేపథ్యంలో అక్కడకీ ప్రత్యేక బలగాలను పంపించారు.
అమాలాపురంలో శాంతియుత వాతావరణం నెలకొల్పేందుకు ఏలూరు రేంజి డీఐజీ పాలరాజుతో పాటు నలుగురు ఎస్పీలు (రవీంద్రబాబు, కాకినాడ.. ఐశ్వర్య రస్తోగి. తూర్పు గోదావరి.. సిద్దార్ధ కుషాల్, ఎన్టీఆర్ జిల్లా.. విశాల్ గున్నీ, గుంటూరు)ను రప్పించారు. వీరంతా అక్కడే ఉండి పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు. పట్టణంలో ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు. సెల్ ఫోన్ సిగ్నళ్లనూ పునరుద్ధరించలేదు. ఎటువంటి నిరసనలకూ, ఆందోళనలకు అనుమతి లేదని పోలీసులు ప్రకటించారు. ప్రస్తుతం అమలాపురం పూర్తిగా పోలీసుల వలయంలో ఉంది.
మరోవైపు అమలాపురంలో నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితులను అదుపులోకి తెచ్చేందుకు అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. కోనసీమవ్యాప్తంగా కర్ఫ్యూ అమలుచేయాలని కలెక్టర్ నిర్ణయించారు. ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా బుధవారం నుంచి కర్ఫ్యూ అమల్లోకి రానుందని ప్రకటించారు. పరిస్థితి పూర్తిగా అదుపులోకి వచ్చే వరకు కర్ఫ్యూ అమల్లో ఉండనుందని అధికారులు తెలిపారు. ఇదిలా ఉంటే ఆందోళనల్లో పాల్గొన్న వారిని గుర్తించేందుకు వీడియో పుటేజ్ లను పోలీసులు పరిశీలిస్తున్నారు. వీడియో ఫుటేజ్ ల ఆధారంగా ఆందోళన కారులపై కేసులు నమోదు చేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా ప్రజాప్రతినిధుల కార్యాలయాలు, ఇళ్ల వద్ద పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు.