– రుయా ఆసుపత్రిలో అమానవీయ ఘటన
– శవాన్ని తీసుకెళ్లాలంటే చార్జీల బాదుడు
– దూరాన్ని బట్టి వేలకు వేలు వసూళ్లు
– చోద్యం చూస్తున్న ప్రభుత్వం
రుయా ఆసుపత్రి ఘటన ఇప్పుడు పెను సంచలనం సృష్టిస్తోంది. సామాజిక మాధ్యమాలను ఈ వార్త ఒక ఊపు ఊపేసింది. అన్నమయ్య జిల్లా చిట్వేలు ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి తన బిడ్డను కిడ్నీ చికిత్స కోసం రుయా ఆసుపత్రికి తీసుకొచ్చాడు..కానీ ఆ బాలుడు చికిత్స పొందుతూ మరణించాడు. ఆ చిన్నారి మృతదేహాన్ని తిరిగి చిట్వేల్ కి తీసుకెళ్లడానికి ఎంతౌతుందని రుయా ఆసుపత్రిలోని అంబులెన్స్ డ్రైవర్లను అడిగాడు. రుయా ఆసుపత్రి నుంచి చిట్వేల్ కు 90 కి.మీ. దూరం కాబట్టి రూ. 20 వేలు చెల్లించాలంటూ డిమాండ్ చేశారు. ఆ తండ్రి కొడుకు చనిపోయిన బాధలో ఉన్నాడు. కూలి పనులు చేసుకుని బతికే అతనికి అంత పెద్ద మొత్తాన్ని ఇచ్చుకోలేనని వాళ్లకు చెప్పాడు. తర్వాత తనకు తెలిసిన వారికి సమాచారం ఇవ్వడంతో వాళ్ళు ఒక అంబులెన్సు ను రుయా ఆసుపత్రి దగ్గరకు పంపించారు. అయితే ఆ అంబులెన్స్ ను ఆసుపత్రిలోకి రానివ్వకుండా డ్రైవర్లు అడ్డుపడి ఆ వచ్చిన అంబులెన్స్ డ్రైవర్ ను దూషిస్తూ కొట్టడానికి ప్రయత్నించారు. దీంతో అతను అంబులెన్స్ ను తిరిగి వెనక్కి తీసుకుపోయాడు. ఈ ఘటనపై అంబులెన్స్ యజమాని ఎస్పీకి ఫిర్యాదు చేశాడు. చేసేదేం లేక ఆ తండ్రి తన కొడుకు మృతదేహన్ని బైక్ మీద పెట్టుకుని చిట్వేల్ కు తెచ్చుకున్నాడు. మానవత్వం మంటగలసిన ఇలాంటి ఒక దారుణ ఘటన పై మీడియాలో ఉప్పెనలా కథనాలు వచ్చిపడ్డాయి.
ఇలాంటి ఘటన ఇదేనా మొదటిసారి జరిగింది అంటే అస్సలు కాదు. గతంలోనూ చాలా జరిగాయి. 2020 లో అత్యవసర పరిస్థితిలో ఒక రోగిని విశాఖకు తీసుకెళ్లడానికి ఇక్కడ ఉన్న ఆంబులెన్స్ అసోసియేషన్ మెంబెర్స్ అంతా కలిసి 15000 డిమాండ్ చేశారు. ఐతే అంత మొత్తాన్ని చెల్లించుకోలేమని చెప్పి రోగి బంధువులు బయటి నుంచి 8 వేలకు ఒక వాహనాన్ని ఆస్పత్రికి పిలిపించుకున్నారు . కానీ ఇక్కడ ఉన్న అంబులెన్సు మాఫియా ఆ వాహనాన్ని లోనికి రానివ్వకుండా అడ్డుకున్నారు. అదే విధంగా 2021 లో ఇలాంటిదే ఒక ఘటన జరిగింది. ఒక పేషేంట్ ని చెన్నై ఆసుపత్రికి తరలించడానికి బయటి నుంచి వాహనాన్ని రప్పించుకున్నారు. దాన్ని కూడా అడ్డుకోవడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. కోవిడ్ టైంలో రోగులు అష్టకష్టాలు పడుతున్నా సరే వారి నుంచి 10000 వసూలు చేశారంటే పరిస్థితి ఎంత దారుణంగా మారిందో అర్ధం చేసుకోవచ్చు.
రుయా ప్రభుత్వ ఆసుపత్రిలో 4 మహాప్రస్థానాలు అందుబాటులో ఉన్నాయి. మరి ఈ పరిస్థితి ఆ చిన్నారి తండ్రికి ఎందుకు వచ్చింది అని పరిశీలిస్తే గనక ఇక్కడ నర్సులు మహాప్రస్థానం వాహన దారులకు ఎలాంటి సమాచారాన్ని ఇవ్వకపోవడం ఒక ప్రధాన కారణం ఐతే రెండోది ఇక్కడ ఉండే ఆర్ ఎం ఓ రెసిడెంట్ మెడికల్ ఆఫీసర్ అందుబాటులో లేకపోవడం..ఆర్ ఎం ఓ చెబితేనే వాహనాలు నడపాలన్న రూల్ ఇక్కడ ఉండడం వలన ఇలాంటి పరిస్థితి తలెత్తింది. అంబులెన్సు డ్రైవర్లు, ఆర్ ఎం ఓలు కుమ్మక్కై ఇలాంటి దందాలకు పాల్పడుతున్నట్లు చక్కగా తెలుస్తోంది. ఆసుపత్రిలో ఉండే రకరకాల డిపార్ట్మెంట్స్ మధ్యన సరైన అవగాహనా లేకపోవడం, రోగులకు సంబందించిన విషయాల గురుంచి సమాచారం ఇచ్చి పుచ్చుకోవడంలో సరైన వ్యవస్థ పనిచేయకపోవడం ప్రధాన కారణాలు. ఆసపుత్రుల్లో ప్రత్యేక రేట్లను నిర్ణయించి ఒక చార్ట్ ని అందరికీ అందుబాటులో ఉంచింది గత ప్రభుత్వం కానీ ఇప్పుడు అలాంటి చార్టులు లేవు, ఎంత దూరానికి ఎంత రేటు అనేది లేదు.
రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వాసుపత్రుల్లో ఇల్లాంటి ఘటనలు కోకొల్లలు. ఇదొక్కటే సమస్య అనుకుంటే పొరపాటు. ఎన్నో రకాల సమస్యలతో రోగులు, కుటుంబ సభ్యులు అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వ పని తీరు సరిగా లేకపోవడం వలెనే ఇలాంటి ఎన్నో రకాల మాఫియాలు జూలు విదిలిస్తూ జులుం చూపిస్తున్నాయి. రుయా లోనే కాదు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. దీన్ని బట్టి చూస్తుంటే వైద్య రంగం మీద ప్రభుత్వం ఏమాత్రం శ్రద్ధ చూపిస్తోందో తెలుస్తోంది. ఇలాంటి మాఫియాలపైనా వారిని పెంచి పోషిస్తున్న వారిపైన ఇప్పటికైనా కఠిన చర్యలు తీసుకోవాలి.. ఇలాంటి ఘటనలు ఇంతకుముందు ఏ ప్రభుత్వాసుపత్రిలో కూడా జరగకుండా చూడాలి.
ఇక విజయవాడ విషయానికి వస్తే ఇక్కడ ఉన్న పాత, కొత్త ప్రభుత్వాసుపత్రుల్లో కూడా ఇలాంటివి జరుగుతున్నాయి. ఇక్కడ ఏ రోగి చనిపోయిన క్షణాల్లో ఆ సమాచారం ప్రైవేట్ అంబులెన్సుల డ్రైవర్లకు చేరిపోతోంది. ఐతే ఇక్కడ గమనించాల్సింది ఏమిటి అంటే ఆసుపత్రిలో ఉన్న స్టాఫ్ కావొచ్చు, వైద్యులు కావొచ్చు వాళ్ళ సహకారం లేనిదే ఈ మాఫియా అనేది పుట్టుకు రాదు. ఏదైనా తప్పు జరిగింది అంటే అక్కడ మూలలను పరిశీలిస్తే అసలు సమస్య ఎవరి వల్ల వచ్చిందనేది యిట్టె అర్థమైపోతుంది. సాంకేతికత పెరిగిపోతున్న కొద్దీ ఇలాంటి ఎన్నో ఆగడాలు కూడా అంతకు మించి జరిగిపోతున్నాయి. అంబులెన్సు డ్రైవర్లు ఎక్కడికక్కడ వాట్సాప్ గ్రూపుల్లో సమాచారం ఇచ్చి పుచ్చుకుంటున్నారు. రోగి మృతి చెందాడు అని తెలిసిన వెంటనే వల్ల బంధువులతో బేరసారాలు మొదలు పెడుతున్నారు. దూరాన్ని బట్టి రేట్ నిర్ణయిస్తున్నారు. విజయవాడ కొత్త ప్రబ్బుత్వాసుపత్రిలో 5 మహాప్రస్థాన వాహనాలు అందుబాటులో ఉన్నాయి. ఉదయం నుంచి రాత్రి 10 గంటల వరకు వాహనాలు, రాత్రి 10 గంటల నుంచి మరో వాహనం అందుబాటులో ఉంటోంది. ఐనా సరే అంబులెన్సు డ్రైవర్ల మాఫియా దందా మాత్రం అలాగే కొనసాగుతోంది. ప్రభుత్వ అంబులెన్సు డ్రైవర్లు ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా మహాప్రస్థానంలో మృతదేహాల్ని చేర్చాలి. కానీ అక్కడ ఏమీ మాట్లాడకుండా ఇంటి దగ్గరకు వచ్చాక వెయ్యి నుంచి ఆ పైనే అడిగి తీసుకుంటున్న సందర్భాలు అనేకం. ఇక పాత ప్రభుత్వ ఆసుపత్రిలో మాత్రం మహాప్రస్థాన వాహనం అనేది ఒక్కటి కూడా లేదు. రోగులు మరణిస్తే గనక కొత్త ప్రభుత్వాసుపత్రి నించి వాహనాలను రప్పించి అందులో తరలిస్తున్నారు ఒక వేళ ఆ వాహనాలు అందుబాటులో లేకపోతె ప్రైవేట్ అంబులెన్సులే దిక్కవుతున్నాయి. ప్రభుత్వాసుపత్రుల్లో అధికారులు బదిలీ వంటివి జరుగుతున్నప్పుడల్లా ఇలాంటి మాఫియాలు మరింత పెట్రేగిపోతున్నాయి. ఇలాంటి దందాల్లో రాజకీయ నాయకులు కూడా కీలకపాత్ర పోషిస్తున్నారని ఆరోపణలు కూడా ఉన్నాయి.
ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు హడావిడి చేసేసి అప్పటికప్పుడు అధికారులను సస్పెండ్ చేసేసి చేతులు దులిపేసుకోవడం ఆనవాయితీగా మారింది. తక్షణ శిక్షలు అవసరమే కానీ శాశ్వత పరిష్కారమే ఎప్పటికయినా మేలు. కాబట్టి ప్రభుత్వం ఆ దిశగా ఆలోచించాలి. శవాల మీద పైసలేరుకుంటున్న ఇలాంటి అంబులెన్సు మాఫియా ఆగడాలకు ప్రభుత్వం అడ్డుకట్ట వేయడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.